వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీసింది. స్వయాన సీఎం జగన్‌కు సమీప బంధువైన బాలినేనే కారాలుమిరియాలు నూరుతుంటే మనమెందుకు సైలెంటుగా ఉండాలి అంటున్నారు ఆ పార్టీలోని అసంతృప్తులు. అయితే.. బాలినేని కోపానికి కారణమేంటనే విషయానికొస్తే కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలే అని చెప్పాలి. జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించిన సమయంలో కొందరు పాతవారిని కొనసాగించారు. కానీ, ఆ లిస్టులో బాలినేని లేరు. బాలినేనికి అవకాశం ఇవ్వకపోగా అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించారు. ఇది బాలినేనికి తీవ్రమైన కోపం తెప్పించింది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తి మొదలైంది.
మంత్రి వర్గ విస్తరణలో పదవిని కోల్పోయిన తర్వాత బాలినేని విజయవాడ నుంచి ఒంగోలు వచ్చేటప్పుడు ఆయన అభిమానులు బొల్లాపల్లి టోల్ ప్లాజా నుంచి భారీ కాన్వాయ్తో ఊరేగింపుగా వెళ్లారు. ఆరోజు మొదలు ఆయన అనేక వేదికలపై తన కుటుంబాన్ని ఆ ప్రతిష్ట పాలు చేయడానికి పార్టీలోని నేతలు కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని ఏం చెబితే పార్టీ అదే చేసేది. ఆ స్థాయి నుంచి బాలినేని ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల సమన్వయకర్తగా నియమించారు. అలా నియమించిన తరువాత నెల్లూరు జిల్లాలో ముగ్గురు రెడ్డి నేతలు జగన్‌ను తిట్టి బయటకు వెళ్లిపోవడంతో అది సమన్వయకర్త బాలినేని వైఫల్యంగా పార్టీలో అనేక మంది భావించారు. జగన్ కూడా అలాగే భావించారు. అందుకే బాలినేని విషయంలో జగన్ కూడా ప్రాధాన్యం తగ్గించారని.. ప్రాధాన్యం తగ్గించడంతో బాలినేని కోపంగా ఉన్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు.
ఆ తరువాత ఇటీవల సీఎం మార్కాపురం పర్యటన సందర్భంగా బాలినేనిని హెలిప్యాడ్ వద్దకు భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆయన అలిగి వెనుదిరిగితే ఆ జిల్లాకే చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ సర్దిచెప్పి సభా వేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సీఎం జగన్ కూడా బాలినేని చల్లార్చేందుకు గాను ఆయనతోనే బటన్ నొక్కించి ఈబీసీ నేస్తం కింద నగదు విడుదల చేశారు. కానీ బాలినేని మాత్రం జగన్‌పై తన కోపాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా ఆ వేదిక నుంచే అన్యాపదేశంగా హెచ్చరికలు చేశారు. ఎంతటి నేతలనైనా ఎదిరిస్తానని హెచ్చరించారు. ఆయన ఎవర్ని ఉద్దేశించి అలా వ్యాఖ్యానించారనేది పార్టీలో చర్చనీయాంశమైంది. పరోక్షంగా వైవీ సుబ్బారెడ్డి గురించే మాట్లాడినట్లు ప్రచారం జరిగింది.
బాలినేని.. వైవీ సుబ్బారెడ్డికి హెచ్చరికలు పంపించడానికి కారణాలున్నాయి. బాలినేని, వైవీ ఇద్దరూ బావాబావమరుదులు అవుతారు. వైఎస్ విజయమ్మకు వైవీ సుబ్బారెడ్డి మరిది అవుతారు… బాలినేని ఆమెకు సోదరుడు అవుతారు. కానీ.. వైవీ, బాలినేని మధ్య మొదటినుంచి వివాదాలున్నాయి. గత ఎన్నికలకు ముందు బాలినేని, వైవీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుండేది. 2014 ఎన్నికల్లో బాలినేని ఓటమి పాలయ్యారు. వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా గెలిచారు. తన ఓటమికి వైవీనే కారణమని బాలినేని భావించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకానొక దశలో బాలినేని అలిగి టీడీపీకి వెళ్లిపోతారనే ప్రచారం జరిగింది. అయితే, అప్పుడు జగన్ తల్లి విజయమ్మ స్వయంగా బాలినేనిని పిలిపించి మాట్లాడి సర్ది చెప్పారు.
2019 ఎన్నికల నాటికి బాలినేని చక్రం తిప్పారు. టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా నిలబెట్టి వైవీకి చెక్ పెట్టారు. దాంతో వైవీ అలిగి విదేశాలకు వెళ్లిపోయారు. వచ్చే దఫా ఎంపీ సీటు ఇస్తామనే హామీతో ఆయన శాంతించారు. ఆమేరకు మళ్లీ వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ సీటు ఇచ్చేందుకే బాలినేనిని జిల్లాకు దూరంగా పెట్టినట్లు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని తిరుగులేని నేతగా ఎదిగారు. మొట్టమొదట నుంచి వాళ్లది కాంగ్రెస్ కుటుంబం. ఎన్ఎస్యూ, యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న బాలినేనికి 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. అప్పటినుంచి వరుసగా ఉప ఎన్నికలతో కలుపుకొని నాలుగు దఫాలు విజయ పరంపర కొనసాగించారు. 2014లో ఓడినా మళ్లీ 2019లో విజయం సాధించారు. నాటి వైఎస్ జమానాలో మంత్రిగా చేశారు. తర్వాత జగన్ కేబినెట్లో అదే ప్రాధాన్యం దక్కింది. కానీ, రెండేళ్ల తరువాత నుంచి బాలినేని ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.
గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించి నాలుగు స్థానాల్లో ఓటమిని చవిచూసిన దరిమిలా ఈ దఫా బాలినేనికి పెత్తనం ఇవ్వలేదు. మంత్రి వర్గ విస్తరణలో మరో చాన్స్ ఇవ్వకపోవడానికీ ఇదే కారణమంటున్నారు. పైగా బాలినేని కుమారుడు, వియ్యంకుడిపై ఇటీవల అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలన్నింటికీ తోడు నాడు వైవీకి ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ ఈదఫా వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీన్ని సహించలేకనే బాలినేని సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. మరి.. బాలినేని నిర్ణయంపై జగన్ ఏం చెస్తారనేది చూడాలి.