టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ విశాఖలోని రుషి కొండను మింగేశారని అన్నారు. ఇక, ఆయన సహచరుడు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి సమీపంలోని ఉండవల్లి కొండను దిగమింగారని దుయ్యబట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో సహజ వనరులను అధికార పార్టీ నేతలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపు, మట్టి మాఫియాతో పాటు తాజాాగా కొండలను సైతం పిండి చేసి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని దందా కొనసాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి కొండను తవ్వుతున్న దృశ్యాలను నారా లోకేష్ విడుదల చేశారు. సహజ వనరుల దోపిడీలో జగన్ రెడ్డిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆదర్శంగా తీసుకున్నారని లోకేశ్ ఆరోపించారు. జగన్ రుషికొండకు గుండు కొడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ఉండవల్లి కొండను మింగేశారని విమర్శించారు.
సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఆళ్ల మైనింగ్ మాఫియా యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉండవల్లి కొండను మాయం చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మైనింగ్ మాఫియా బెదిరింపులకు భయపడకుండా పోరాడి.. కొండపై జరుగుతున్న గ్రావెల్ లూటీని బయటపెట్టిన మంగళగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని లోకేశ్ అభినందించారు. ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు.
ఎక్కడికక్కడ ప్రజలు పెద్ద ఎత్తున లోకేష్ పాదయాత్రకు తరలివస్తున్నారు. లోకేష్‌కు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. జగన్ ప్రభుత్వంలో తాము పడుతున్న బాధలను ప్రజలు లోకేష్‌కు వివరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సమస్యలు తీర్చుతామంటూ లోకేష్ పాదయాత్రలో హామీలు ఇస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates