కోనసీమ జిల్లా పి.గన్నవరం వైసీపీలో అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైఖరితో స్థానిక నాయకులు విసిగిపోతున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. పార్టీలో ఇమడలేకపోతున్నామని నాయకుడు చెబుతున్నారు. జగనన్నే మా భవిష్యత్ అంటూ గృహసారథులు, వలంటీర్లు ఇంటింటికి వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్యేతో కలిసి వెళ్తే.. తమను ప్రజలు తిడుతున్నారనేది ద్వితీయ శ్రేణి నాయకుల ఆరోపణ.
నాలుగేళ్లయినా నియోజకవర్గానికి ఏం చేశారంటూ ఎమ్మెల్యేని నిలదీస్తున్నారని.. దీంతో ఆయన వారితో ఘర్షణకు దిగుతున్నారని అందుకే ఆయనతో కలిసి వెళ్లలేక పోతున్నామని నాయకులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. అసలు ప్రజల ఆగ్రహానికి కారణం నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియాలు ఎమ్మెల్యే కనుసన్నల్లోనే సాగుతున్నాయనేది వైసీపీ నేతల ఆవేదన. దీంతో ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయని గుసగుస వినిపిస్తోంది.
ఎమ్మెల్యే చిట్టిబాబు వైఖరికి నిరసనగా.. పలు గ్రామాల్లో పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధమవుతున్నారని సమాచారం. కీలకమైన అయినవిల్లి మండల బీసీ నాయకుల్లో రకరకాల అనుమానాలు, ఆందోళన లు ఉన్నాయి. ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ రాజీనామాకు సిద్దమవుతున్నట్టు బాహాటంగానే వార్తలు వస్తున్నాయి.
జగన్నాధపురం సర్పంచ్ మేడిశెట్టి ఉషారాణి, ఆమె భర్త శ్రీనివాస్, ఇదే గ్రామానికి చెందిన ఎంపిటీసి జిలగం హేమలత… ఇలా పలువురు గ్రామ స్థాయి నాయకులు కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. అయితే.. వీరినిస్థానిక మంత్రి ఒకరు సర్దిచెబుతున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు సర్దు కుం టాయని హామీ ఇస్తున్నారని సమాచారం. మొత్తానికి కొండేటి వ్యవహారం వివాదంగా మారుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates