ఆ ఐఏఎస్‌కు చుక్క‌లు చూపిస్తున్న వైసీపీ స‌ర్కార్‌!!

ఏపీలో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు జ‌రిగాయి. గురువారం అర్ధరాత్రి దాటిన త‌ర్వాత‌.. స‌ర్కారు ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసుకునే హ‌క్కు.. ప్ర‌భుత్వానికి ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా జ‌రిగిన‌వి మాత్రం సాధార‌ణ బ‌దిలీలు కావనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రో ఏడాదిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చేసిన బ‌దిలీల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇటీవ‌లే ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పారు. “మీకు న‌చ్చిన అధికారులే వ‌స్తారు” అని.

ఆ వెంట‌నే బ‌దిలీల‌కు శ్రీకారం చుట్ట‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. దాదాపు సీనియ‌ర్లు అంద‌రినీ.. జిల్లా అధికారులుగా ప‌క్క‌న పెట్టేశారు. వారికి శాఖ‌లు అప్ప‌గించారు. జూనియ‌ర్లను ఎక్కువ‌గా జిల్లాల‌కు కేటాయించారు. ఇదిలావుంటే.. గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్‌.పి. సిసోడియాకు ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఆయ‌న‌ను ఏమాత్రం ప్రాధాన్యం లేద‌ని ఐఏఎస్‌లు భావించే ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియ‌మించింది.

దీనికి కార‌ణం.. ఏంటంటే.. కొన్నాళ్ల కింద‌ట ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణకు ఆయ‌న అప్ప‌టి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసేలా అప్పాయింట్‌మెంట్ ఇప్పించార‌నే వాద‌న ఉంది. సిసోడియా కార‌ణంగానే సూర్య‌నారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌గ‌లిగార‌ని.. వారి జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారని స‌ర్కారు భావిస్తోందని అంటున్నారు.

ఊహించని ఆ పరిణామంతో.. కంగుతిన్న వైసీపీ ప్రభుత్వం.. ఉన్నపళంగా సిసోడియాను బదిలీచేసింది. ఆయనకు ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. సూర్యనారాయణతో పాటు ఉద్యోగులకు సిసోడియానే గవర్నర్‌ అపాయింట్‌మెంట్ ఇప్పించారన్న కారణంతో.. ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని.. ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని హఠాత్తుగా తప్పించిన ప్రభుత్వం.. ఆయననూ.. మానవ వనరుల అభిృద్ధి కేంద్రం డైరెక్టర్‌గానే నియమించింది.