బొత్స సత్యనారాయణ.. జనం సత్తిబాబు అని పిలుస్తారు. నచ్చని వాళ్లు చాలా పేర్లు పెడతారనుకోండి. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలీదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ తరపున మీడియాలో మాట్లాడే సజ్జల కూడా అంతే. ఎప్పుడు, ఎలా, ఎందుకు మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి పరాభవం ఎదురైనప్పటి నుంచి నేతలు రోజువారీగా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. అదీ తమ పరాజయం కాదని, ఏదో జరిగిపోయిందని చెప్పేందుకు వైసీపీ నేతలు పడని పాట్లు లేవు. బొత్స తనదైన శైలిలో ఆలస్యంగా స్పందించేశారు. పైగా ఇప్పుడు బాధ్యత తీసుకుంటానని కూడా అంటున్నారు.
గెలుపోటముల మధ్య భారీ అంతరం ఉన్నా సజ్జల మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లంతా తమవారు కాదని చెప్పుకొచ్చారు. వారు తమ సంక్షేమ పథకాల జాబితాలో లేరని అన్నారు. ఓటమికి తమ ప్రభుత్వ పనితనం బాగోకపోవడం కాదని, సమర్దించుకునే ప్రయత్నం చేశారు.
కట్ చేస్తే ఇదే అంశం పై మంత్రి బొత్స భిన్నంగా స్పందించారు. సజ్జల వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని , ఆ ప్రాంత మంత్రిగా వైసిపి గెలుపు కోసం సాయశక్తుల కృషి చేశానని పేర్కొన్న బొత్స దీని పై త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ లు వైసిపికి ఓటర్ లు కాదని, ఆ సెక్షన్ తమకు వర్తించదని సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా మంత్రి బొత్స రాజకీయ పార్టీ ప్రతినిధిగా తానైతే ఈ ఓటమిని అంగీకరిస్తానని సమీక్షించుకుంటానని పేర్కొన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఓడినంత మాత్రాన వారంతా తమ ఓటర్ లు కాదని తానైతే చెప్పనని అనేశారు. పైగా సజ్జల వ్యాఖ్యలు అని తెలిసి కూడా బొత్సా వాటిని తోసిపుచ్చారు.
ఇద్దరు నేతలు తీరుపై వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. మేకపోతు గాంభీర్యాలతో ప్రజల హృదయాలను గెలుచుకోలేమని అంటూ.. ఇకనైనా జనం మనోభావాలు అర్థం చేసుకుని ప్రవర్తిద్దామని సూచిస్తున్నారు.
బాధ్యత వహించడంపై బొత్స బహిరంగ ప్రకటన ఇవ్వడం కూడా కరెక్టు కాదని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే బాధ్యత వహించే నాయకుడు తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. ప్రకటనలకంటే సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న పొరపాట్లపై దృష్టి సారిస్తే విజయం ఖాయమని అంటున్నారు. మరి ఆ ఇద్దరు అర్థం చేసుకుంటారో లేదో చూడాలి…
Gulte Telugu Telugu Political and Movie News Updates