అత్యంత కీలకమైన గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ వల్లభనేని వంశీకి ఎదురు గాలి వీస్తోందా? ఆయ న ఓటమిని ముందుగానే రాసిపెట్టుకునే పరిస్థితి వచ్చిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అంచనా వేస్తున్న వారు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. పార్టీ మార్పును మెజారిటీ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా 38 వేల వరకు ఉన్న యాదవుల ఓటింగ్ గత ఎన్నికల్లో వంశీకి పండింది.
అయితే.. ఇప్పుడు వారంతా ఆయనకు యాంటీగా ఉన్నారని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ బచ్చుల అర్జునుడుకు అవకాశం ఇస్తారని తెలిసిన యాదవులు.. ఆయనకు అనుకూలంగా చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన అకాల మరణంతో వారంతా.. టీడీపీకి అనుకూలంగా ఓటేయాలని భావిస్తున్నట్టు అంచనా. మరోవైపు కమ్మ వర్గం కూడా వంశీకి దూరమైందనే టాక్ వినిపిస్తుం డడం గమనార్హం.
ప్రధానంగా గత రెండు సార్లతో పోల్చుకుంటే.. ఇప్పుడు వంశీ ప్రజలకు చేరువ కాలేక పోతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అదే సమయంలో గతంలో ఏ సమస్య వచ్చినా.. నేనున్నానంటూ.. వంశీ వచ్చేవారని, కానీ.. ఇప్పుడు ఆలోచిస్తున్నారని కూడా ప్రజలు చెబుతుండడం గమనార్హం. దీంతో సహజం గానే వంశీ విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు.. వైసీపీ నేతలు కూడా గ్రూపు రాజకీయాలకు తెరదీశారు. దీంతో వంశీకి అన్ని వైపుల నుంచి ఎదురు గాలివీస్తోందని ఇక్కడ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న వారు చెబుతున్నారు.
దీంతో వంశీ విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే.. 55 వేల వరకు కమ్మ ఓట్లు ఉన్నాయి. అదే సమయంలో 38 వేల ఓట్లు యాదవులు ఉన్నారు. 10-20 వేల ఓట్లు ఇతర బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారివి ఉన్నాయి. ఈ క్రమంలో వారిని ఆకర్షించేందుకు ఇప్పటి వరకు వంశీ ఎలాంటి గట్టి ప్రయత్నాలు అయితే చేయలేదు. సంప్రదాయంగా పడుతున్న ఓటు బ్యాంకు తనకు చెక్కుచెదరదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates