తెలంగాణ రాజకీయాల్లో కొద్దితరోజులుగా సాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కొత్త టర్న్ తీసుకుంటోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి స్వరం వినిపిస్తున్న ఈ మాజీ ఎంపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమివ్వగా పొంగులేటి మాత్రం విజయమ్మ మాటలను ఖండించారు.
టీవీ చానల్‌తో మాట్లాడిన విజయమ్మ పొంగులేటి విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు కొడుకుతో సమానమని.. శ్రీనివాసరెడ్డి వైఎస్ కుటుంబసభ్యుడని విజయమ్మ అన్నారు. ఇటీవల శ్రీనివాసరెడ్డి తన భార్యతో కలిసి తమను కలిశారని, షర్మిల పార్టీలో చేరుతానని, ఆమెకు అండగా ఉంటానని మాట ఇచ్చారని విజయమ్మ చెప్పారు.
షర్మిల అసలు రాజకీయాల్లోకి వస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదని, కొన్ని కారణాల వల్ల తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చిందని… ఆమె పార్టీ పెట్టేముందు తనను కలిసినప్పుడు ఇదంతా చాలా కష్టమైన ప్రయాణమని మాత్రమే చెప్పానని విజయమ్మ అన్నారు.
రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయనకు అండగా నిలిచిందని… ఇప్పుడు షర్మిలకు కూడా ఖమ్మం జిల్లా అండగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఏపీలో తమ కుటుంబానికి పులివెందుల ఎలాగో తెలంగాణలో పాలేరు నియోజకవర్గం కూడా అలాంటిదేనని ఆమె అన్నారు.
అయితే… తాను విజయమ్మను కలిసిన మాట వాస్తవమేనని… తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు శుభలేఖ ఇవ్వడానికి వెళ్లానని చెప్పారు. షర్మిల పార్టీలో చేరుతానని తాను మాట ఇవ్వలేదని పొంగులేటి అన్నారు. మరోవైపు పొంగులేటి బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రోజురోజకూ తన గళం విప్పుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన వేరే పార్టీలో చేరడం ఖాయమే అయినప్పటికీ ఏ పార్టీలో చేరుతారన్నదే ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారింది. విజయమ్మ చెప్తున్నట్లు షర్మిల పార్టీలో పొంగులేటి చేరితే మాత్రం అది ఆ పార్టీకి చాలా పెద్ద విషయమేనన్నది విశ్లేషకుల మాట.