నెల్లూరు రాజకీయాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. అధికార వైసీపీలో అసమ్మతి ఏకంగా బయటపడిపోవడంతో రోజూ రచ్చరచ్చ జరుగుతోంది. ఇంతకాలం తమ ప్రభుత్వం ఏ పనీ చేయడం లేదంటూ అసమ్మతి వ్యక్తంచేసిన నేతలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో జగన్‌ను ఇరకాటంలో పడేశారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమైతే అది కానీ అన్నట్లుగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, స్థానిక వైసీపీ మంత్రి, మాజీ మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లడం ఖాయమని అనుచరులే కాదు ఆయన కూడా ఓపెన్‌గా చెప్తున్నారు.
అయితే… కోటంరెడ్డి ఇష్యూ మొదలుకావడానికి ముందు వరకు ఆనం రామనారయణరెడ్డి ఫైర్ మీద ఉండేవారు. చాలాకాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్న ఆనం కూడా తాజాగా ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఆనం అసంతృప్తి గళం పెంచడంతో ఇప్పటికే ఆయన నియోజకవర్గమైన వెంకటగిరి ఇంచార్జిగా మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన రెడ్డి కుమారుడిని నియమించారు. దీంతో ఆనం కూడా వైసీపీని వీడి బయటకు రావడం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది.
అయితే, ఆనం టీడీపీలోకి వెళ్తారని ఇంతవరకు ప్రచారం జరిగింది. ఆనం కుమార్తె కైవల్య రెడ్డి ఆత్మకూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారని… ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి కానీ నెల్లూరు రూరల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరిగింది. ఇద్దరి విషయంలోనూ చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారన్న సంకేతాలు టీడీపీ నుంచి వచ్చాయి.
గత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచిన ఆనం ఈసారి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని కోరుకున్నారు. 2009లో నెల్లూరు రూరల్ నుంచి ఆనం రామనారాయణరెడ్డి అన్న వివేకానందరెడ్డి గెలిచారు. ఆ తరువాత 2014, 2019 నుంచి కోటంరెడ్డి గెలుస్తూ వస్తున్నారు.
అయితే… ఇప్పుడు కోటంరెడ్డి కూడా టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరగడంతో ఆనం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలోకి వచ్చిన తరువాత అక్కడ కోటంరెడ్డి నుంచి ఇబ్బందులు వస్తే ఎలా అనేది ఆనం ఆందోళనగా తెలుస్తోంది. వైసీపీలో ఇద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు. కోటంరెడ్డి దూకుడు మనిషి కాగా ఆనం సాఫ్ట్ పొలిటీషియన్. దీంతో టీడీపీలోకి వెళ్లిన తరువాత కూడా అక్కడ కోటంరెడ్డితో ఇష్యూస్ ఏర్పడితే ఎలా అనేది ఆనం ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఆనం బీజేపీలో చేరాలన్న ఆలోచనలోనూ ఉన్నట్లుగా చెప్తున్నారు. కుమార్తె టీడీపీ నుంచి పోటీ చేయడం ఖరారైనా తాను టీడీపీలోకి వెళ్లాలా బీజేపీలోకి వెళ్లాలా అనేది ఆనం తేల్చుకోలేకపోతున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు.