ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీలో సెకెండ్ పవర్ సెంటర్. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను టార్గెట్ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఈటల బీజేపీలో చేరినప్పటి నుంచి కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈటల కొంచెం పైచేయి సాధించారని చెబుతున్నారు. వేములవాడ నుంచి సంజయ్ అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటే ఈటల అడ్డు తగిలారు. అధిష్టానం దగ్గర లాబీయింగ్ చేసి సంజయ్‌ను కరీంనగర్‌లో పోటీ చేయాలని చెప్పించారు. అక్కడ మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న క్రమంలో సంజయ్‌కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
కేంద్ర మంత్రి సమక్షంలో…
కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వనీ వైష్ణవ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పనిలో పనిగా బీజేపీ అంతర్గత సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. సమావేశంలో అందరూ ఉండగానే ఈటల తన అటాక్‌ను ప్రారంభించారు. స్థానిక పరిస్థితులను వైష్ణవ్‌కు వివరించేందుకు ప్రయత్నించిన ఈటల, రాష్ట్ర శాఖకు దిశానిర్దేశం లేదని ఆరోపించారు. కేంద్రంపై బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చే విషయంలో సమాచారం రావటంలేదని ఈటల వాపోయారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటే ప్రస్తుత పోరాటం సరిపోదన్నారు ఈటల. తెలంగాణలో ఏం చేయాలో.. ఎలా చేయాలో చెప్పేవారు రాష్ట్ర పార్టీలో లేరన్నారు.
రఘునందన్ సపోర్ట్
ఈటల మాట్లాడుతుండగా పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడ్డుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం చేస్తోందని కేంద్రమంత్రితో పొంగులేటి చెప్పారు. అయితే.. ఈటలను మాట్లాడనీయాలంటూ పొంగులేటిని రఘునందనరావు వారించారు. ఆయన్ను పూర్తి చేయనివ్వండని సూచించారు. దానితో ఈటల తమ మాటలను కొనసాగించారు. అంతా విన్న వైష్ణవ్ తలూపి ఊరుకున్నారు. అయితే ఇదంతా సంజయ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈటల మాట్లాడినట్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇంతకాలం ముసుగులో గుద్దలాటలా పొలిటికల్ గేమ్ ఆడిన ఈటల ఇప్పుడు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు భావించాల్సి ఉంటుంది..