మా ఉద్యోగాలు ప్రజాప్ర‌తినిధుల భిక్ష కాదు: బొప్ప‌రాజు ఫైర్‌

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉద్యోగుల‌కు హామీల‌ను తుంగ‌లో తొక్కుతున్నార‌ని.. అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జీతభత్యాలు సకాలంలో రావడం లేదని.. ఈ విషయం ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రజాప్రతినిధుల దయ దక్షిణ్యాలతో ఉద్యోగాలకు రాలేదని, పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకున్నామని అన్నారు.

“ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీలే అమ‌లు కావ‌డం లేదు. ఉద్యోగుల‌కు రావాల్సిన బ‌కాయిలు ఇవ్వ‌డం లేదు. ప్ర‌జ‌ల‌కు విష‌యం తెలియాల్సి ఉంది. ఉద్యోగులు అడుగుతున్న గొంతెమ్మ కోరిక‌లు కావు. కొత్త కోరిక‌లు కూడా కావు. ఇవి కేవ‌లం జీత భ‌త్యాల‌కు సంబంధించిన విష‌యం. వీటిని స‌కాలంలో ఇవ్వ‌కుండా.. వేధిస్తున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు నోటికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు” అని బొప్ప‌రాజు అన్నారు.

చట్టపరంగా తమకు రావాల్సిన జీతభత్యాలు సమయానికి రావడం లేదని.. ముఖ్యమంత్రి చెప్పినా ఇవ్వక పోవడంతో రోడ్డున పడ్డామని బొప్ప‌రాజు చెప్పారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. జీతాల కోసం ఎదురుచూసే దుస్థితికి ప్రభుత్వం చేరుకుందని అన్నారు. తాము దాచుకున్న డబ్బులు అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ సమాచారం ఇచ్చినా ఇప్పటికీ డిపార్టుమెంట్‌లకు పంపలేదన్నారు. ఇక టిఏ, డిఏల ధ్యాస లేదని… వాటిని ఎప్పుడో తీసివేశారని పేర్కొన్నారు.

జీతాలు స‌కాలంలో రాక‌పోవ‌డంతో ఉద్యోగులు నానా తిప్ప‌లు ప‌డుతున్నారని అన్నారు. ప్ర‌భుత్వం ప్ర‌తి నెల 20వ తేదీ వ‌ర‌కు ఇస్తున్న‌ట్టు చెప్పిందని, ఇంత క‌న్నా హాస్యాస్పదం ఏముంద‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వాలు కూడా ఆల‌స్యం చేశాయ‌ని చెబుతున్నార‌ని.. కానీ, అలా చేయ‌లేద‌న్నారు. ఎప్పుడైనా ఆల‌స్య మైన సంద‌ర్భాలుంటే.. సంఘాలకు చెప్పి చేశాయ‌ని తెలిపారు. పండ‌గ‌ల స‌మ‌యంలో రెండు మూడు రోజుల ముందుగానే వేత‌నాలు ఇచ్చార‌ని చెప్పారు. వేల కోట్ల రూపాయ‌ల బ‌కాయిలు ఏమ‌య్యాయి? ఇవి ఏం చేశారు? అని బొప్ప‌రాజు నిల‌దీశారు.

పీఆర్సీ పే స్కేల్స్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు విభాగాల‌కు పంపించ‌లేదని అన్నారు. ఇదే విష‌యాన్ని మంత్రి వ‌ర్గ క‌మిటీలో చెప్పినా.. స్పందించ‌లేద‌న్నారు. అనేక ర‌కాలుగా ఉద్యోగుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని చెప్పారు. పీఆర్సీ ఎరియ‌ర్స్‌కు అతీగ‌తీ లేకుండా పోయింద‌ని అన్నారు. టీఏలు, డీఏల సంగ‌తిని ఎప్పుడో మ‌రిచిపోయే ప‌రిస్థితి తెచ్చార‌ని అన్నారు.

భారతదేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పెన్షన్ విధానాన్ని ఏపీలో అమలు చేస్తున్నారని బొప్పరాజు విమర్శించారు. కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మూడేళ్లుగా కమిటీలు తప్ప ఫలితం లేదన్నారు. ప‌దోన్న‌తులు కూడా తేల్చ‌లేద‌న్నారు. త్వ‌ర‌లోనే ఉద్య‌మానికి రెడీ అవుతున్నామ‌ని చెప్పారు. తెలంగాణ‌లో కాంట్రాక్టు ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింద‌న్నారు. కానీ, ఏపీలో మాత్రం ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక కొలిక్కి రాలేద‌న్నారు.