తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 40 ఎకరాల భూమిని అప్పనంగా 4 వేల కోట్లకుకొట్టేశారని.. రఘునందనరావు సంచలన ఆరోపణలు చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఆరోపించారు.
అయితే.. రఘునందనరావు చేసిన ఈ వ్యాఖ్యలపై తోట రియాక్ట్ అయ్యారు. బీజేపీ నేతలు తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాదులో తనకు ఒక్క ఎకరా ఇచ్చినట్లు వారు నిరూపిస్తే 10 శాతం తను తీసుకుని మిగిలిన 90 శాతం ఆరోపణలు చేసిన వారికే ఇచ్చేస్తానని అన్నారు. కేవలం బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు మాత్రమే రఘునందనరావు ఇలా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
సంచలనాల కోసం బీజేపీ నేతలు పనికిమాలిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుల ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. తెలంగాణలో ఏ రకమైన సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయో వాటిని ఏపీ ప్రజలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఏపీలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతోందని తోట అన్నారు. త్వరలోనే విశాఖలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో నేటి సభకు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తున్నామని, సభను విజయవంతం చేస్తున్నామని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కాగా, ఏపీ నుంచి 2 వేల బస్సులను తోట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి గాను ఆయన దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.