ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తాను అండగా ఉంటానని ప్రకటించారు. ఏపీలో పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్న తరుణంలో కేసీఆర్, జగన్‌లు కలిసి ఆయన్ను బలహీనపర్చే లక్ష్యంతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్‌లో చేరికల పేరుతో ఎర వేస్తున్నారని కన్నా అన్నారు.
కాగా కన్నాకు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఏమాత్రం పొసగడం లేదు. కన్నా వర్గానిక చెందిన నేతలను సోము వీర్రాజు పదవుల నుంచి తప్పిస్తూ వస్తున్నారు. మరోవైపు కన్నా కూడా ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. వీటన్నిటి నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం ఖాయమని… ఆయన తనతోపాటు కాంగ్రెస్ మాజీ నేతలు, కాపు నేతలను ఒక్కరొక్కరిగా జనసేనలోకి తీసుకొస్తారనే అంచనాలు వినిపిస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణను కాకలు తీరిన నేతగానే చెప్పుకోవాలి. 3 దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 1989లో ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన గుంటూరు వెస్ట్, పెదకూరపాడు నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి గెలిచారు. మొత్తం అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అయిదుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేశారు.
నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో ఆయన మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కన్నాకు ఆ పార్టీ ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. కానీ, 2019లో కన్నా గుంటూరు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలైన తరువాత ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి వీర్రాజు, కన్నా వర్గాల మధ్య ఏమాత్రం సయోధ్య లేకుండానే సాగుతోంది.
సోము వీర్రాజు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే కన్నా జనసేనతో సమన్వయం చేసుకుంటూ సాగాలన్న వాదన వినిపించేవారు. తాజాగా గుంటూరు జిల్లా అధ్యక్షుడిని మార్చడంతో కన్నాలో కోపం కట్టలు తెంచుకుంది. తనను అడగకుండా, కోర్ కమిటీని సంప్రదించకుండా తన అనుచరుడిని గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించారంటూ కన్నా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరో కీలక విషయాన్నీ బయటపెట్టారు. సోము వీర్రాజు వియ్యంకుడు కూడా బీఆర్ఎస్‌లో చేరారంటూ విమర్శలు చేశారు. అదే సమయంలో కన్నా జీవీఎల్ నరసింహరావునూ ఉతికి ఆరేశారు.
పవన్ కల్యాణ్ లక్ష్యంగా కేసీఆర్, జగన్‌లు కలిసి రాజకీయం చేస్తున్నారని కన్నా ఆరోపించారు. దాన్ని అడ్డుకుంటూ తాను పవన్‌కు అండగా ఉంటానని అన్నారు. అయితే… జనసేనలోకి వెళ్తారా.. బీజేపీలో ఉంటూనే పవన్‌కు మద్దతుగా ఉంటారా అనేది కన్నా ఇంకా స్పష్టం చేయలేదు. కానీ… 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కన్నా లక్ష్మీనారాయణ ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయంగా దెబ్బతింటామన్న ఉద్దేశంతో జనసేన నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కన్నా ఇలా బహిరంగంగా పవన్‌కు మద్దతు పలకడంతో పాటు ఆయనతో కలిస్తే రాజకీయంగా జనసేనకు అది లాభదాయకమే అవుతుంది. కాపుల్లో పట్టున్న నేతగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న కన్నా జనసేనకు యాడ్ అయితే ఎన్నికల్లో ఆ పార్టీకి అది మేలే చేయొచ్చు.
This post was last modified on January 4, 2023 9:27 pm
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…