టీడీపీలోకి వైసీపీ ఎన్నిక‌ల‌ వ్యూహ‌క‌ర్త‌?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ఎప్పుడు ఏం చేస్తారో ఎవ‌రూ చెప్ప‌లేరు. అవ‌కాశం-అవ‌స‌రం.. అనే ఈ రెండు ప‌ట్టాల‌పైనే వారు త‌మ న‌డ‌క సాగిస్తారు. అనేక మంది రాజ‌కీయ నేత‌లు.. త‌మ వ్య‌క్తిగ‌తం కావొచ్చు.. వ్యాపారం కోసం కావొచ్చు.. లేదా రాజకీ య అవ‌స‌రం కోసం కావొచ్చు.. పార్టీలు మారిన మారుతున్న సంద‌ర్భాలు అనేక ఉన్నాయి.

ఎన్నికల సమయంలో లేదా అంతకంటే ముందు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి ఫిరాయించడం తెలిసిందే. ఇది రాజ‌కీయ నేత‌ల‌కే ప‌రిమితం అనుకుంటే పొరపాటే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు ఈ జంపింగులు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల్లోనూ క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఒక పార్టీ కోసం పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్తలు ఇంకో పార్టీ కోసం.. ప‌నిచేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇది కూడా కొత్త‌కాదు. 2014లో మోడీ కోసం ప‌నిచేసిన ప్ర‌శాంత్ కిశోర్‌.. త‌ర్వాత కాంగ్రెస్ కోసం.. గోవాలో ప‌నిచేశారు. సో.. ఎప్పుడు ఎవ‌రికి ఏది అనుకూల‌మో దానిని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఇలానే.. ఏపీలోనూ వైసీపీ కోసం ప‌నిచేస్తున్న ఒక వ్యూహ‌క‌ర్త‌.. టీడీపీలోకి చేరిపోయారని తెలుస్తోంది.

ఐప్యాక్‌(ఇండియ‌న్‌-పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ) స‌భ్యుడు ఒక‌రు వైసీపీని వ‌దిలి టీడీపీ పంచ‌న చేరారు. ఐప్యాక్ క‌మిటీ ప్ర‌స్తుతం వైసీపీ కోసం.. ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఐప్యాక్ అడుగులు వ‌స్తోంది.

ఇక‌, ఈ ఐప్యాక్‌లో కీల‌క స‌భ్యుడిగా ఉన్న శంత‌ను సింగ్ టీడీపీలోకి చేరిన‌ట్టు ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇటీవల వరకు ఐప్యాక్‌ టీమ్‌లో కోర్ మెంబర్‌గా ఉన్న శంతను సింగ్ టీడీపీ వ్యూహ‌క‌ర్త‌.. రాబిన్ శర్మ నిర్వహిస్తున్న షోటైమ్ కన్సల్టింగ్ (STC)కి మారారు. దీనిని పోల్ వర్కౌట్ కోసం టీడీపీ నియమించింది. 2024లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేయ‌డ‌మే ఈ ఎస్ టీసీ ప‌ని.

శంత‌ను సింగ్, IIT-కాన్పూర్ పూర్వ విద్యార్థి. పైగా వైసీపీ ఐప్యాక్ లీడ‌ర్‌ రిషి రాజ్ సింగ్‌కు సన్నిహితుడు నిన్న మొన్న‌టి వ‌ర‌కు I-PAC పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్‌ను చూశారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఈయ‌న ఐప్యాక్ త‌ర‌ఫున వైసీపీ కోసం ప‌నిచేశారు. అయితే.. ఇటీవ‌ల ఐప్యాక్‌తో తెగ‌తెంపులు చేసుకుని.. టీడీపీ గూటికి చేరిపోయారు. శంత‌ను సింగ్ సింగ‌పూర్‌లోని లీ కాన్ యీ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ పాల‌సీ నుంచి ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌లో మాస్ట‌ర్ డిగ్రీ చ‌దివారు.

సింగపూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఆయ‌న‌ I-PACలో తిరిగి చేరారు. రెండు నెలల క్రితం వరకు, వైసీపీలో బిజీగా ఉన్నారు. కానీ కొన్ని చిత్రమైన కారణాలతో I-PACకు రాజీనామా చేసి, రాబిన్ శర్మ బృందంలో “డైరెక్టర్” స్థాయి హోదాలో చేరారు. సుదీర్ఘ కాలం వైసీపీలో ప‌నిచేసి ఉండ‌డంతో ఆయ‌న‌కు అన్ని విష‌యాలు తెలుసు. సో.. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ఆయ‌న‌ను తీసుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.