తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గవర్నర్‌పై ఇప్పటి వరకు ఉన్న మూతి బిగింపులు.. అలకల విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం.. వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. ఎన్నికల ముంగిట పంతాలకు, పట్టింపులకు పోతే.. కీలకమైన బిల్లుల విషయంలో మరింత సాచివేత కొనసాగడం ఖాయం. దీంతో అంతిమంగా నష్టం వచ్చేది తెలంగాణ ప్రభుత్వానికే. సో.. అందుకే ఇప్పుడు కేసీఆర్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే..
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ సర్కారు ఎనిమిది కీలక బిల్లులను తీసుకొచ్చింది. వాటిలో రెండు కొత్తవి కాగా మిగిలిన 6 చట్ట సవరణలకు చెందిన బిల్లులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కీలక విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసేలా చట్టం చేసేందుకు బిల్లును ప్రవేశ పెట్టారు. అదేవిధంగా.. సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రిసెర్చ్ సెంటర్‌ను తెలంగాణ ఫారెస్ట్ వర్సిటీగా మారుస్తూ బిల్లు ప్రవేశ పెట్టారు.
అలాగే, కొన్ని ప్రైవేట్ వర్సిటీలకు కొత్తగా అనుమతి ఇచ్చే ప్రైవేట్ యూనివర్సిటీల చట్టాన్ని సవరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం బిల్లు తెచ్చింది. అలానే.. జీహెచ్ఎంసీ, పురపాలకచట్టాలకు సవరణ చేస్తూ మరో బిల్లును తెచ్చింది. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, అత్యంతకీలకమైన ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను తీసుకొచ్చింది. ఈ బిల్లులను తెలంగాణ అసెంబ్లీ, మండలి కూడా ఆమోదించాయి.
అయితే, వీటిని చట్టం రూపంలో అమలు చేసేందుకు గవర్నర్ తమిళ సై ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ వీటిలోని జీఎస్టీ సవరణ బిల్లును మాత్రం ఆమోదించి మిగిలిన ఏడు బిల్లులను తొక్కి పెట్టారు. బిల్లుల విషయంపై గవర్నర్ స్పందించడం లేదు. ప్రభుత్వం కూడా స్పందించలేదు. దీంతో మూడు నెలలు గడిచిపోయాయి. నిబంధనల మేరకు ఇప్పటికే వాటికి ఆమోద ముద్ర వేయాల్సి ఉన్నా.. గవర్నర్ మాత్రం ఆ పనిచేయడం లేదు.
ఈ నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ భేటీకి సిద్ధపడుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు గవర్నర్‌తో సంప్రదింపులు జరపక తప్పదని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే కేసీఆర్ మొండి వైఖరికి వెళ్తే.. ఆయా బిల్లులు ముందుకు నడిచే పరిస్థితి లేదు. పోనీ.. ఎలానూ గవర్నర్ తొక్కిపెట్టారు కాబట్టి.. మరోసారి ఆమోదించేద్దామా? అంటే.. ఆమె తిరస్కరిస్తేనే దీనికి లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు కూడా మళ్లీ కొత్త బిల్లులను కేసీఆర్ ఆమెకు పంపించాల్సిందే. సో.. ఎలా చూసుకున్నా.. కేసీఆర్ దిగిరాక తప్పదని అంటున్నారు పరిశీలకులు.