పాద‌యాత్ర‌ల ఏపీ.. ఎన్ని పార్టీలంటే!

ఏపీలో రాజ‌కీయ పార్టీల‌ పాద‌యాత్ర‌లు ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీని గ‌ద్దెదించి.. త‌మ త‌మ పార్టీల‌ను అధికారంలోకి తెచ్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగాపార్టీలు పాద‌యాత్ర‌ల‌కు స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు, పార్టీ యువ నాయ‌కుడు నారా లోకేష్ పాద‌యాత్ర‌కు రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఈయ‌న జ‌న‌వ‌రి 27 నుంచి పాద‌యాత్ర చేయ‌నున్నారు. దాదాపు 400 రోజులు నిర్విరామంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ఆయ‌న ప్లాన్ చేసుకున్నారు.

ఇక‌, బీజేపీ కూడా.. వ‌చ్చే జ‌న‌వ‌రిలో సంక్రాంతి ముగిసిన త‌ర్వాత‌.. పాద‌యాత్ర‌కు రెడీ అవుతోంది. గ్రామాల‌ను వ‌దిలేసి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో బీజేపీని పుంజుకునేలా చేసేందుకు పాద‌యాత్ర చేయాల‌ని యోచిస్తున్న‌ట్టు పార్టీ కీలక నాయ‌కుడు.. స‌త్య ప్ర‌క‌టించారు. అయితే..ఈ పాద‌యాత్ర విష‌యాన్ని పార్టీ అధిష్టానం వ‌ద్ద చ‌ర్చించి.. అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుందని, ఇది వ్య‌క్తిగ‌త పాద‌యాత్ర కాద‌ని.. నాయ‌కులు అంద‌రూ క‌లిసి.. పాద‌యాత్ర‌లో పాల్గొంటార‌ని.. ఇది ఆరు మాసాల పాటు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా పాద‌యాత్ర‌కు రెడీ అవుతోంది. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండాగా డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ ఏపీ అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ ప్ర‌క‌టించారు. తమ పాదయాత్రకు ప్రజలు మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీలు కలిసిపోయాయని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని శైలజానాథ్ విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో వైసీపీ ప్ర‌భుత్వం విఫలమయ్యిందని మండిపడ్డారు.

ఇక‌, జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాద‌యాత్ర‌కు బ‌దులుగా బ‌స్సు యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అయితే, దీనికి ఈ ఏడాది అక్టోబ‌రులోనే ముహూర్తం ప్ర‌క‌టించినా.. వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి త‌ర్వాత‌.. లేదా.. సంక్రాంతి త‌ర్వాత‌.. ఈ బ‌స్సు యాత్ర ఉంటుంద‌ని పార్టీ కీల‌క నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు. ఇలా.. మొత్తంగా ఏపీలో 2023 పాద‌యాత్ర‌ల నామ సంవ‌త్స‌రంగా మారుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ పాద‌యాత్ర‌ల‌ను ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.