వైసీపీ గడ్డపై టీడీపీ దూకుడు

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌రిస్థితి తారుమార‌వుతోంది. 2014, 2019లో తిరుగులేని విధంగా ఇక్క‌డ వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. 2014లో రాజంపేట‌లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే, 2019 వ‌చ్చే స‌రికి మాత్రం వైసీపీ పూర్తిగా ప‌ట్టు పెంచుకుంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల‌ను కూడా వైసీపీ ద‌క్కించుకుంది. అంటే మొత్తంగా క‌డ‌ప‌పై పూర్తి ప‌ట్టు సాధించింది. పైగా 2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నేత‌లు చాలా మంది బీజేపీలోకి వెళ్లిపోయారు. సీఎం ర‌మేష్, ఆది నారాయణరెడ్డి వంటివారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. దీంతో స‌హ‌జంగానే క‌డ‌ప‌లో టీడీపీ ప‌ట్టు పోయింద‌నే వాద‌న వినిపించింది.

అయితే, ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేలో వైసీపీపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించింది. బ‌ద్వేలు, రాజంపేట‌, రైల్వే కోడూరు, క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ స్ప‌ష్టంగా ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ప‌రిస్థితి తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కుల‌కు కూడా చెప్పిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ ఫ‌లితం సాకారం అయ్యేలా త‌మ్ముళ్లు ప‌నిచేయాల‌ని కూడా ఆయ‌న సూచించిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే.. వైసీపీ ఎందుకు వెనుక‌బ‌డింద‌నే విష‌యం తెలుస్తోంది.

బ‌ద్వేల్‌: ఇక్క‌డ ఈ ఏడాది జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సుధ విజ‌యం ద‌క్కించుకున్నారు. వ్య‌క్తిగ‌తంగా ఆమె వైద్యురాలు. అయితే, త‌న భ‌ర్త మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో పోటీ చేసి విజ‌యం సాధించారు. కానీ, ప్ర‌జల‌కు మాత్రం చేరువ కాలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పైగా ప్ర‌భుత్వంలోని కొంద‌రు కీల‌క నాయ‌కులు ఏం చెబితే అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేగా సుధ విఫ‌ల‌మ‌య్యారు. ఈ ప‌రిణామాలు టీడీపీకి క‌లిసివ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు.

క‌డ‌ప‌: క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌కు ఒక‌ప్పుడు కంచుకోట‌. ఈ ఓట్లు వైసీపీకి మ‌ళ్లాయి. దీంతో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్నారు. అయితే, ఇక్క‌డ గెలిచిన అంజాద్‌బాషా రెండు సార్లు మైనారిటీ కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నా.. ఆశించిన విధంగా మాత్రం ఆయ‌న ప‌నిచేయ‌లేక పోతున్నారనే వాద‌న వినిపిస్తోంది.

రైల్వేకోడూరు: ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో కొరుముట్ల శ్రీనివాస్ వైసీపీ త‌ర‌ఫున వ‌రుసగా గెలిచారు. అయినా కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోతున్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించిన ఆయ‌న గ‌ర్వ‌భంగం అయింది. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌లేక‌పోతున్నార‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ‌కూడా టీడీపీకి ప్ల‌స్సులు పెరుగుతున్నాయి.

రాజంపేట‌: జిల్లాల ఏర్పాటు కు ముందు నుంచి ఇక్క‌డ వైసీపీ కి వ్య‌తిరేక‌త పెరిగింది. త‌మ ప్రాంతాన్ని అన్న‌మయ్య జిల్లా కేంద్రంగా మార్చాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుతున్నారు. అయినా.. వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో త‌మ నేత‌ను ఇక్క‌డ గెలిపిస్తే.. ప్ర‌జ‌ల కోరిక మేర‌కు రాజంపేట‌ను జిల్లా కేంద్రం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఇక్క‌డ టీడీపీకి అనుకూల వాతావ‌ర‌ణం పెరుగుతోంది.

మైదుకూరు: ఇక్క‌డ టీడీపీ వ‌రుస ప‌రాజ‌యాలు చ‌విచూస్తోంది. అయితే, ఇప్పుడు డీఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే విష‌యంపై ఇటీవ‌ల స‌ర్వే నిర్వ‌హించ‌గా.. మెజారిటీ ప్ర‌జ‌ల‌కు డీఎల్‌కు జై కొట్టారు. దీంతో ఇక్క‌డ టీడీపీ గెలుపు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టు సంపాయించుకుని ఈ నాలుగు స్థానాల్లో గెలిచేలా వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పాల‌ని అంటున్నారు.