ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి పని చేసిన గొప్ప ముఖ్యమంత్రుల్లో ఒకరిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పేరుంది. ఆయన్ని గొప్ప మానవతావాదిగా అభివర్ణిస్తారు చాలామంది. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలూ ఇస్తారు సన్నిహితులు.
ఇప్పుడు వైకాపా మీద విమర్శలు, ఆరోపణలతో యాంటీగా మారిపోయిన ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వైఎస్ గురించి ఇలాంటి మంచి విషయాలు కొన్ని చెప్పారు. బుధవారం వైఎస్ జయంతి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో వైఎస్ పెద్ద మనసు చాటుకున్న ఓ ఉదంతాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
‘‘2004లో వైఎస్ గెలిచిన తర్వాత పాదయాత్రకు సంబంధించి ఓ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందులో ప్రతి ఫొటోల్లో ఓ వ్యక్తి ఉండటాన్ని వైఎస్సార్ గమనించి ఆయన్ను ట్రేస్ చేసి తీసుకురావాలని పోలీసులకు సూచించారు. వెంటనే వారు తీసుకొచ్చారు. ‘ఏమయ్యా ప్రతి ఫొటోలో ఉన్నావు.. ఒక్కసారి కూడా కనిపించలేదు’ అని వైఎస్సార్ అడిగితే.. ‘నేనో గొర్రెల కాపరిని సార్. ఉన్న గొర్రెలు అమ్మేసి మీతో పాటు నడిచాను. మీతో మాట్లాడేందుకు ధైర్యం చాల్లేదు’ అని చెప్పాడు. వెంటనే వైఎస్సార్ ఆయనకు రూ. 5 లక్షలు డబ్బు ఇచ్చి, 50 గొర్రెలు తీసివ్వాలని పక్కనున్న వారికి చెప్పారు. నీకు ఇక ఏ కష్టమొచ్చినా నేనున్నాని గుర్తుంచుకో అన్నారు.. అంతటి గొప్ప మనిషి వైఎస్సార్’’ అంటూ వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని ఎంపీ రఘురామ కృష్ణరాజు గుర్తు చేసుకున్నారు.