ఇవ్వ‌లేక వైసీపీ చెప్ప‌లేక టీడీపీ ఏపీలో ‘సంక్షేమ‌ రాజ‌కీయం’!

ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు బెంగ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న పార్టీల‌ను.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న పార్టీలను కూడా ఈ బెంగ వెంటాడుతోంది. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే సంక్షేమ ప‌థ‌కాల‌కు దాదాపు అల‌వాటు ప‌డిపోయార‌ని మేధావులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అమ్మ ఒడి, రైతు భ‌రోసా,నేత‌న్న నేస్తం, వైఎస్సార్ చేయూత‌ ఇలా అనేక ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు అందిస్తోంది. దీంతో ప్ర‌జ‌లు కూడా ఈ ఉచిత ప‌థ‌కాల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఆదిలో ఇవి చాలా మందికి అందినా.. త‌ర్వాత కాలంలో ప్ర‌భుత్వంపై భారం ప‌డుతోంద‌నే భావ‌న‌తో ల‌బ్ధిదారుల‌ను త‌గ్గించారు.

అంతేకాదు.. పైకి ఎన్ని చెబుతున్నా.. పార్టీ సానుభూతిప‌రుల‌కు ప్ర‌ధానంగా.. ఈ ప‌థ‌కాల‌ను అందిస్తున్నార‌ని టీడీపీ వంటి విప‌క్షాలు విమ‌ర్శిస్తూనే ఉన్నాయి. ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ ప్ర‌మేయం లేక‌పోయినా.. నాయ‌కులు మాత్రం క్షేత్ర‌స్థాయిలో త‌మ వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని వైసీపీ నేత‌లు కూడా త‌ర‌చుగా అంటున్నారు. ఇదే.. ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంద‌రికీ అన్నీ అందుతున్నాయ‌ని చెప్పే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఒక‌వేళ చెప్పినా.. ప్ర‌జ‌లు ఆధారాల‌తో స‌హా.. త‌మ‌కు ఎలాంటి ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మంలోనే చెబుతున్నారు.

సో ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. ఫ‌లితం మాత్రం చాలా చాలా త‌క్కువ‌గా ఉందనే అభిప్రాయం వైసీపీలోనే వినిపిస్తోంది. ఇది వైసీపీ నేత‌ల‌కు క‌ల‌వ‌రంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా ముందుకుసాగాల‌ని వారు ఆలోచ‌న చేస్తున్నారు. మ‌రికొన్ని చోట్ల నాయ‌కులను ప్ర‌జ‌లు.. ఇంతేనా.. ఇంకా ఏమైనా పెంచుతారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అంటే.. ప్ర‌స్తుతం ఇస్తున్న‌ ప‌థ‌కాల‌కు తోడు మ‌రిన్ని పెంచుతారా? అనేది ప్ర‌జ‌ల అంత‌రంగంగా మారింది. కానీ, స‌ర్కారు మాత్రం అలా చేయలేదు. కొత్త ప‌థ‌కాలు తెచ్చే ఆలోచ‌న వైసీపీలో క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఉన్న ప‌థ‌కాల‌కే నిధులు స‌రిపోక‌.. ఇబ్బందులు ప‌డుతోందనే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌భుత్వం కూడా.. అప్పులు చేస్తున్నామ‌ని చెబుతోంది. ఈ సొమ్మును.. ప్ర‌జ‌ల సంక్షేమానికే వినియోగిస్తున్నామ‌ని అంటోంది. దీంతో కొత్త ప‌థ‌కాలు రావు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీటిని కొన‌సాగిస్తారా? లేదా.. అనేది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కారు ఇస్తున్న ప‌థ‌కాల‌ను చంద్ర‌బాబు కొన‌సాగిస్తారా? లేదా.. అనే చర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో తాము కూడా సంక్షేమ‌ ప‌థ‌కాలు కొన‌సాగిస్తామ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కొన్నాళ్ల కిందట కుప్పం ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని చెప్పారు. మేం అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తామ‌న్నారు. సంక్షేమం ఆగ‌ద‌న్నారు. అయితే.. దీనికి కూడా ఒక హ‌ద్దు ఉండాల‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఆయ‌న ఏ విష‌యం తేల్చి చెప్ప‌లేదు. అదేస‌మ‌యంలో మ‌రిన్ని ప‌థ‌కాలు కూడా తీసుకువ‌స్తామ‌న్నారు. మొత్తంగా.. చూస్తే.. ఉచిత హామీల‌పై చంద్ర‌బాబు తేల్చలేదు. మ‌రోవైపు.. వైసీపీ కూడా.. అప్పులు చేసి చేస్తున్న సంక్షేమాన్ని వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కొన‌సాగిస్తుందా? అనేది స్ప‌ష్టత ఇవ్వ‌డం లేదు. దీంతో.. రాష్ట్రం సంక్షేమ రాజ‌కీయంపై తెగ చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.