పీకే వ్యూహాలు ప‌నిచేయ‌డం లేదు బాస్‌..

జాతీయ స్థాయిలో ఒక‌ప్పుడు.. దూకుడుగా వెళ్లిన ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే.. త‌న వ్యూహాల‌తో పార్టీల‌ను అధికారంలోకి తెచ్చాన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. కానీ, వాస్త‌వానికి.. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు అప్ప‌టికే.. ఉన్న అధికార పార్టీల‌పై చూపిన విముఖ‌త నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు త‌ప్ప‌.. పీకే వ్యూహాల‌కు కాద‌ని.. కొన్నాళ్లుగా మేధావులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు నిజ‌మ‌ని తేలిపోయింది. పీకే వ్యూహాలు చెల్లుబాటు కావ‌డంలేదేని.. ఆయ‌న ఇటీవ‌ల కాలంలో ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నార‌ని జాతీయ‌స్థాయిలోనే గ‌గ్గోలు ప్రారంభ‌మైంది.

ఈ ఏడాది విష‌యాన్ని తీసుకుంటే.. ఈ సంవ‌త్స‌రం.. ప్రారంభంలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ రూ.47.54 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నివేదిక సమర్పించింది. టీఎంసీ.. గోవాలో ఖర్చు చేసిన మొత్తం బీజేపీతో ఖర్చుతో పోలిస్తే రెండు రెట్లు అధికం. అధికార బీజేపీ రూ.17.75 కోట్లు ఖర్చు చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ రూ.12 కోట్లు మేర వెచ్చించింది. అయినా.. అధికారంలోకి రాలేదు. పైగా.. ఎన్నిక‌ల ఖ‌ర్చు మిగిలింది. ఇదంతా పీకే వ్యూహంతోనే ఖ‌ర్చు చేశార‌ని అంటున్నారు.

ఇక‌, మాట‌ల మాంత్రికుడు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ.. గోవాలో రూ.3.5 కోట్లు ఖర్చు చేసింది. 2017లో బోణీ కొట్టిన ఆప్.. 2022లోనూ పోటీ చేసింది. అయితే అనుకున్నంత మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్.. గోవాలో బోణీ కొట్టలేకపోయింది. ఈ రెండు పార్టీలూ పీకే క‌నుస‌న్న‌ల్లోనే ముందుకు సాగాయి. ఆయ‌న అక్క‌డే తిష్ట‌వేసి మ‌రీ వీటిని న‌డిపించారు. అయినా.. ఫ‌లితం లేకుండా పోయింది.

ఇక‌, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ.. పీకే వ్యూహాల‌ను ఎన్సీపీ అమ‌లు చేసింది. ఈ క్ర‌మంలోనే ఎన్సీపీ రూ.2.75 కోట్లు ఖర్చు పెట్టింది. పార్టీ తరపున పోటీ చేసిన 11 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ప్రచారానికి ఖర్చు చేసింది. శివసేన సైతం.. గోవా ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మొత్తం రూ.92 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఆప్.. గోవా ఎన్నికల బరిలో రెండో సారి నిలిచింది. అయినా.. ఎక్క‌డా స‌త్తా చాట‌లేక పోయాయి.

పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా గోవా ఎన్నికల్లో టీఎంసీ బరిలో దిగింది. అందుకే మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జట్టుకట్టింది. భారీగా ధనాన్ని ఎన్నికల కోసం ఖర్చు పెట్టింది. అయినా గోవాలో శాసనసభ ఎన్నికల్లో చతికిలపడింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 23 సీట్లలో టీఎంసీ పోటీ చేయగా.. ఒక్క సీటు గెలవలేదు. టీఎంసీ భాగస్వామి పార్టీ అయిన ఎంజీపీ 13 స్థానాల్లో పోటీ చేసి 2 రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్.. తృణమూల్ కాంగ్రెస్కు గోవాలో వ్యూహకర్తగా పనిచేశారు.

ఆప్.. 39 మందిని బరిలో దింపగా ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు. గోవా శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ, ఆప్.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాయని కాంగ్రెస్ అప్పట్లో ఆరోపించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క సీటు తగ్గడం వల్ల బీజేపీ.. ఎంజీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ శాసనసభాపక్షం.. బీజేపీలో విలీనమైంది. ప్రతిపక్ష నాయకుడు మైఖేల్ లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ సహా 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఇలా.. పీకే.. వ్యూహాలు మొత్తంగా.. బెడిసికొడుతున్నాయ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.