రాష్ట్రంలో ప్రతిపక్షాలను కలిపిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటి పేరును ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన విషయం తెలిసిందే. నిజానికి ఇది అనవసరమైన ప్రక్రియే అయినా జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి మరీ మార్పు చేశారు. పేరు మార్పుకు జగన్ చెప్పిన కారణాలు తన యాంగిల్లో ఓకేనే కానీ మామూలుగా అయితే పెద్దగా అతకటంలేదు.
ఈ నేపధ్యంలోనే టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. పేరుమార్పు రాజకీయానికి వ్యతిరేకంగా టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా తోడయ్యారు. వీళ్ళే కాకుండా వామపక్షాలు, శాసనమండలిలో పీడీఎఫ్ ఎంఎల్సీ కూడా నిరసన వ్యక్తంచేశారు. జగన్ కు వ్యతిరేకంగా చాలా విషయాల్లో టీడీపీ, జనసేనలు కలుస్తునే ఉన్నాయి. అయితే టీడీపీతో ఎక్కడా కలవటంలేదు. సమాంతరంగా తన పనేదో బీజేపీ చేసుకుపోతోంది.
కానీ ఈ విషయంలో మాత్రం టీడీపీతో బీజేపీ నేతలు కూడా నిరసన గొంతుకలిపారు. వామపక్షాల్లో సీపీఐ ఎలాగూ చంద్రబాబుకు మద్దతుగా నిలబడుతోంది కాబట్టి ఇపుడు మద్దతు తెలపటంలో వింతేమీలేదు. ఎవరెంత డిమాండ్ చేసినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తొలగించాల్సిన అవసరం ఏమిటనేది కీలకమైంది. నిజంగా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న పాయింట్ అర్ధవంతమైనదే.
ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టినంత మాత్రాన వైసీపీకి వచ్చే ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు. పథకాలకు, కార్యక్రమాలకు పేర్ల ఏవిపెట్టినా జనాలకు పెద్దగా పట్టింపు ఉండదు. కాకపోతే అవి అమలవుతున్న పద్దతే కీలకమైనది. ఇపుడు హెల్త్ యూనివర్సిటి పేరు మార్పు విషయంలో ప్రతిపక్షాలను ఏకంచేసిన ఘనత మాత్రం జగన్ కే దక్కుతుందని చెప్పటంలో సందేహంలేదు. కేంద్రంలో నరేంద్రమోడీ వెళుతున్న దారిలోనే రాష్ట్రంలో జగన్ వెళుతున్నారేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates