లోకేశ్ పై రోజా ఫైర్: అమ్మతో.. భార్యతో బెదిరించి పదవిలోకి..

గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో తన మాటలకు పదును పెంచిన నారా లోకేష్ పై విమర్శల బాణాల్ని ఎక్కు పెట్టారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఘాటుగా రియాక్టు అయ్యారు. మూడు రాజధానులపై ఇటీవల కాలంలో లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. ఆయనపై మండిపాటుతో వార్తల్లోకి వచ్చారీ లేడీ ఫైర్ బ్రాండ్. లోకేశ్ ఒక పిల్లి పిత్రే అంటూ ఎటకారం ఆడేసిన రోజా.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి తల్లి.. భార్యతో చంద్రబాబును బెదిరించి దొడ్డిదారిన పదవులు పొందారంటూ మండిపడ్డారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో దారుణమైన హెచ్చరింపు రోజా నోటి నుంచి వచ్చేసింది. ‘లోకేశ్ అడ్రస్ లేని ఒక వెధవ. ఏది పడితే అది మాట్లాడితే జనాలతో అక్కడే కొట్టిస్తా. దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయిన వ్యక్తా సీఎంను విమర్శించేది?’ అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు.. తాను.. కొడాలి నాని టీడీపీ నుంచే వచ్చామని చెప్పిన రోజా.. ‘కొడాలి నాని మాట్లాడిన వాటిల్లో తప్పు ఏముంది? నాడు ఎన్టీఆర్ అభిమానులుగా మేం టీడీపీలో ఉన్నాం. ఆ తర్వాతి పరిణామాలతో బయటకు వచ్చాం. కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ విరుచుకుపడ్డారు.

మూడు రాజధానుల బిల్లు పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని టీడీఎల్పీ సమావేశంలో చర్చించారని.. ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందన్న ఆమె.. చంద్రబాబు వెనుక ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుసా? అంటూ ప్రశ్నించారు.

మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాలన్న ఆమె.. రాంగ్ రూట్ లో ఎమ్మెల్సీ అయిన లోకేశ్ .. ముఖ్యమంత్రి జగన్ పై అవాకులు చవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామన్నారు. కొడాలి నాని బాషలో తప్పేముందన్న రోజా.. ఆయనపై ఈగ వాటితే సహించేది లేదన్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తూ.. ఇళ్లపై దాడి చేస్తారా? అని మండిపడ్డ రోజా.. తెలుగుదేశం పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు. లోకేశ్ ను టార్గెట్ చేస్తూ.. కొడాలి నానిని వెనకేసుకొస్తూ రోజా మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.