నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఆది నుంచి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మూడు రాజధానులు అంటూ తెరమీదికి తెచ్చి.. ఇక్కడి రైతులతో కన్నీరు పెట్టించింది. ఇప్పుడు ఇదే పరంపరలో మరో గందరగోళానికి తెరలేపింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామపంచాయతీలతో.. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభించింది. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది.
దీని ప్రకారం.. తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలతో.. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయనున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో రాజధాని పరిధిలో గ్రామసభలు నిర్వహించారు. గతంలో 19 గ్రామాలతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను.. అన్ని గ్రామాల్లోని ప్రజలు తిరస్కరించారు.
సీఆర్డీఏ చట్టంలోని 29గ్రామాలతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు 22 గ్రామాలతో మున్సిపాలిటీ దిశగా చర్యలు చేపట్టింది. నోటీసులు అందుకున్న 10రోజుల్లోగా అభ్యంతరాల ప్రక్రియ పూర్తి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
నిర్దేశించిన గడువులోగా సమాధానం ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీకి ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామని పేర్కొన్నారు. గతంలో తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు రాజధాని పరిధిలో లేవు. ఇప్పుడు వాటిని కూడా కలిపి అమరావతి మున్సిపాలిటి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. మునిసిపాలిటీ ఏర్పాటుపై రైతులు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ఏదేమైనా.. మూడు రాజధానుల విషయాన్ని పక్కన పెట్టేవరకు అమరావతిపై గందరగోళం తొలిగిపోదని పరిశీలకులు చెబుతున్నారు.