ఏపీ సీఎం జగన్ పేరు ఎత్తకుండానే.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పలు విమర్శలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ.. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని… ప్రతిసందర్భంలోను తాను మరింత ధృడంగా తయారయ్యానని అన్నారు. పల్లెటూరు జీవితం నుంచి సుప్రీం కోర్టు దాకా తన జీవన ప్రయాణంలో ఎన్ని కష్టాలు పడ్డారో వివరించే ప్రయత్నంలో… పరోక్షంగా జగన్ ప్రభుత్వ చర్యలను ప్రస్తావించారు.
తన కుంటుంబం విశ్వసనీయతపై దాడి చేశారని.. ఆ దాడిని తాను, తన కుటుంబం మౌనంగానే భరించామని ఆయన అన్నారు. చివరికి సత్యమే గెలిచిందంటూ ‘సత్యమేవ జయతే’ అన్నారు. జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు అమరావతి వద్ద ముందస్తు సమాచారంతో భూములు కొని లబ్ది పొందాయని నేరుగా సుప్రీం కోర్టుకే జగన్ ప్రభుత్వం రాసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలను ప్రస్తావించారు. “ఒక వ్యక్తి వ్యక్తిత్వం సకల సౌకర్యాలు ఉన్నపుడు కాదని.. కష్టాలు, సవాళ్ళు ఎదురైనపుడు ఎక్కడ నిలబడ్డాడనే అంశం తెలుపుతుంద“ని అన్నారు.
తాను ఏదైనా సాధించానంటే… అది ఎంతో కష్టపడటం… సవాళ్ళను ఎదుర్కోవడం…పోరాటం చేశాకే తనకు దక్కిందేనని జస్టిస్ రమణ అన్నారు. ఎవరైనా సరే.. ఉన్నతస్థానానికి చేరుకోవాలంటే.. కష్టపడాలని ఆయన సూచించారు. ప్రస్తుత ప్రపంచంలో ఏదీ ఊరికేనే రాదన్న ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొంటేనే ఎంచుకున్న రంగంలో విజయవంతంగా నిలబడతారని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తులు వస్తారు, వెళతారు కానీ సుప్రీంకోర్టు శాశ్వతం. ప్రతిఒక్కరూ ఈ వ్యవస్థకు ఎంతో కొంత తమ భాగస్వామ్యాన్ని అందిస్తారు. ఈ విషయంలో నా శాయశక్తులా కృషిచేశాను. అని ఆయన వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates