అధికార పార్టీ ఎంఎల్ఏల్లో టెన్షన్ మొదలైందా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒకే ఒక వార్నింగ్ తో చాలామంది ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోందట. ఇంతకీ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అదనపు సమన్వయకర్తను నియమించటమే. మామూలుగా ఎంఎల్ఏలు ఉన్న నియోజకవర్గాలకు వాళ్ళే సమన్వయకర్తలుగా ఉంటున్నారు. వైసీపీ ఎంఎల్ఏలు ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్ధులనే సమన్వయకర్తలు గా నియమించారు.
అయితే తాడికొండలో వైసీపీ ఎంఎల్ఏ డాక్టర్ శ్రీదేవి ఉండగానే అదనపు సమన్వయకర్తగా ఎంఎల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించారు. సమన్వయకర్తగా ఎంఎల్ఏ ఉన్నపుడు అదనపు సమన్వయకర్తగా మరో నేతను నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే శ్రీదేవి పనితీరు బాగా లేదని జగన్ కు రిపోర్టులు వచ్చుండచ్చు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకూడదని జగన్ అనుకునుండచ్చు. లేదా ఆమె పనితీరును మెరుగుపరుచుకుంటుందున్న ఉద్దేశ్యంతోనే అదనపు సమన్వయ కర్తను నియమించుడచ్చు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పనితీరు మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లిచ్చేది లేదని జగన్ ఇప్పటికే స్పష్టంగా రెండు మూడు సందర్భాల్లో చెప్పేశారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందే అని ఆదేశించారు. ఇన్నిసార్లు జగన్ చెప్పినా కొందరు యాక్టివ్ గా లేరు. మరికొందరు జనాలతోను, పార్టీ క్యాడర్ తో ను టచ్ లో లేరని ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళని పిలిచి వార్నింగులిస్తున్నా కొందరిలో మార్పు రాలేదటని సమాచారం.
ఇక శ్రీదేవి విషయానికి వస్తే ఆమె చుట్టూ చాలా వివాదాలున్నాయి. అలాగే ఆమెపై చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో ఆమె లాభంలేదని జగన్ భావించి నియోజకవర్గంలో అదనపు సమన్వకర్తను నియమించారు. అంటే తొందరలోనే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అదనపు సమన్వయకర్తలను నియమించబోతున్నారనే సంకేతాలు వెళ్ళాయి. దాంతో ఏ ఏ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమిస్తారనే విషయంలో చర్చ పెరిగిపోతోంది. ఈ విషయంలోనే ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది.