అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో స్వయంగా కేసీఆర్ పాల్గొన్నారు. ఎటూ బహిరంగ సభకు వస్తున్నారు కాబట్టి అభ్యర్ధిని ప్రకటిస్తారని అందరు ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసేశారు. పావుగంట సేపు మాట్లాడిన కేసీయార్ అభ్యర్ధి గురించి అసలు ఏమీ ప్రస్తావించలేదు. టీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించమన్నారే కానీ పలానా అభ్యర్ధిని పోటీలోకి దింపుతున్నట్లు చెప్పలేదు.
అభ్యర్ధిని పరిచయం చేయటానికి బహిరంగ సభకు మించిన అవకాశం ఏముంటుంది ? ఇక్కడ సమస్య ఏమిటంటే అభ్యర్ధిని ప్రకటిస్తే పార్టీలో ఎలాంటి సమస్య వస్తుందో అని కేసీఆర్ భయపడుతునట్లున్నారు. ఎందుకంటే మాజీ ఎంఎల్ఏ కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని అభ్యర్ధిగా దింపాలని కేసీయార్ డిసైడ్ చేశారు. అయితే సీఎం నిర్ణయాన్ని మునుగోడు నియోజకవర్గంలోని నేతల్లో అత్యధికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కూసుకుంట్లే అభ్యర్ధి అయితే నేతల్లో ఎంతమంది పార్టీలో ఉంటారో కూడా తెలీటంలేదు.
కేసీఆర్ ఆలోచన అర్ధమైన నేతల్లో కొందరు ఇప్పటికే టీఆర్ఎస్ కు రాజీనామాలు చేసి బీజేపీలో చేరిపోయారు. ఇంకొందరు అదే బాటలో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఏమి చేయాలో కేసీఆర్ కు అర్ధమవుతున్నట్లులేదు. మెజారిటీ నేతల డిమాండ్ ప్రకారం వేరే అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలా ? లేకపోతే నేతలను పట్టించుకోకుండా కూసుకుంట్లనే అభ్యర్ధిగా ప్రకటించాలా ? అనే డైలమాలో ఉన్నట్లు అర్ధమవుతోంది.
ఉపఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే కూసుకుంట్లను ప్రకటించేస్తే పార్టీ పుట్టి ముణిగిపోతుందని భయపడినట్లున్నారు. అందుకనే వ్యూహాత్మకంగా పార్టీకి ఓట్లేసి గెలిపించమని మాత్రమే కోరారు. బహిరంగ సభలోనే అభ్యర్ధిని కేసీఆర్ ప్రకటించబోతున్నట్లు పార్టీలో, మీడియాలో బాగా ప్రచారమైంది. చివరకు పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించిన తర్వాతే కేసీఆర్ వెనక్కుతగ్గారు. విషయం ఏమిటంటే కూసుకుంట్లను అభ్యర్థిగా ఎప్పుడు ప్రకటించినా పార్టీలో ఇదే సమస్య ఉంటుందని కేసీఆర్ మర్చిపోయినట్లున్నారు. చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.