తొందరలోనే జరగుతుందని అనుకుంటున్న మునుగోడు ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం జనాలకు తాయిలాన్ని ప్రకటించింది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో 10 లక్షలమందికి పెన్షన్లు మంజూరుచేసింది. ఉపఎన్నిక ముందు 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ డిసైడ్ చేసిందంటేనే అర్ధమైపోతోంది ఇది కేవలం ఉపఎన్నిక తాయిలమని. సరిగ్గా ఉపఎన్నిక ముందు ఇలాంటి తాయిలాలను ప్రభుత్వం ప్రకటిస్తే జనాలు ఓట్లేసేస్తారా ?
కొద్దినెలల క్రితం జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో ఏమైందో అందరు చూసిందే. హూజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించాలన్న పట్టుదలతో ఎస్సీల కోసం దళితబంధు పథకాన్ని కేసీయార్ ప్రకటించారు. ఒక్కో లబ్దిదారుడికి రు. 10 లక్షలన్నారు. నియోజకవర్గంలోని సుమారు 23 వేలమంది ఎస్సీలకు లబ్ది దొరుకుతుందన్నారు. దరఖాస్తులు తీసుకుని కొందరికి డబ్బులు వేశారు కొందరికి వేయలేదు.
కొందరికేమో ఖాతాల్లో పడిన డబ్బులు కూడా తిరిగి వెనక్కు వెళ్ళిపోయాయి. ఇదే కాకుండా రోడ్లు వేశారు, పక్కా భవనాలు కట్టించారు, ఇళ్ళు కూడా నిర్మించారు. అడిగిన వారికి అడిగినట్లు డబ్బులు పంచారు. పథకాల్లో లబ్దిదారులందరికీ ఫలాలు అందేట్లు చూశారు. ఇంతచేసినా చివరకు టీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే ఇంతకాలం ఎలాంటి పథకాలు అమలుచేయకుండా కేవలం ఉపఎన్నికలో గెలుపుకోసమే పథకాలను అమలుచేస్తే ఎందుకు అమలుచేస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకులు కాదు జనాలు.
సేమ్ టు సేమ్ అదే పద్దతిలో ఇపుడు 10 లక్షల మందికి పెన్షన్ల మంజూరు కూడా. డెఫనెట్ గా ఈ 10 లక్షల్లో మునుగోడు జనాలు కూడా ఎక్కువగా ఉంటారనటంలో సందేహంలేదు. ఇంతకాలం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపకుండా, సంక్షేమపథకాలు అమలు చేయకుండా ఇపుడు పథకాలు, కార్యక్రమాలు ఎందుకు మొదలుపెడుతోందో జనాలకు తెలీదా ? ఇంత హడావుడిగా క్యాబినెట్ ఏర్పాటుచేసి లక్షలమందికి పెన్షన్లు మంజూరు చేయటంలోనే కేసీయార్ లో టెన్షన్ స్పష్టంగా కనబడుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates