భారమైపోతున్న సలహాదారులు

సలహాదారులు, కన్సల్టెన్సీ..పేరు ఏదైతేనేమి వేతనాలు, బత్యాల పేరుతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయటమే అవుతోంది. తాజాగా జ్వాలాపురం శ్రీకాంత్ ను  దేవాదాయశాఖలో సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఏపీ బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ అనంతపురంకు చెందిన వ్యక్తి. అసలు దేవాదాయశాఖలో సలహాదారు పోస్టే లేదు. అయినా కొత్తగా కేవలం శ్రీకాంత్ కోసమే పోస్టును సృష్టించి మరీ నియమించినట్లుంది.

అసలు దేవాదాయశాఖలో సలహాదారుగా శ్రీకాంత్ ఏమి చేస్తారో ? ఏమి చేయాలో ప్రభుత్వానికి క్లారిటీ ఉందా అనేది డౌటే. ఒక వ్యక్తిని సలహాదారుగా నియమించుకుంటున్నదంటే సదరు వ్యక్తికి ఆ రంగంలో అపారమైన అనుభవం ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం తమిష్టమొచ్చిన వ్యక్తులను ఇష్టమొచ్చిన పద్దతిలో సలహాదారులుగా నియమించేసుకుంటోంది. ఇప్పటికే చాలామంది సలహాదారులున్నారు. వారంతా ఏమిచేస్తున్నారో ప్రభుత్వానికే తెలియాలి.

తాజాగా ముగ్గురు సలహాదారులు ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారుగా జీవీ గిరి, ఐటి సలహాదారుగా దేవిరెడ్డి శ్రీనాధ్, జే విద్యాసాగర్ రెడ్డి పదవీకాలాన్ని ఏడాది కాలం  పొడిగించింది. నిజానికి ఇలాంటి సలహాదారుల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కేవలం జీత, బత్యాలు అందుకోవటం తప్ప వేరే ప్రయోజనాలేమీ ఉండటం లేదు.  

తమను నమ్ముకున్నవారికి ఏదో పద్దతిలో ప్రభుత్వంలో పోస్టింగు ఇప్పించుకోవటమే పాయింట్. ఆ పద్దతిలోనే సలహాదారులుగా చాలామంది నియమితులయ్యారు. వీళ్ళిప్పటివరకు ప్రభుత్వానికి ఏమి సలహాలిచ్చారో తెలీదు. ప్రభుత్వం కూడా వాళ్ళ నుండి ఎలాంటి సలహాలు తీసుకున్నది ? వీళ్ళ వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగం జరిగిందా అనేది మదింపు చేయటానికి కూడా అవకాశం లేదు. ప్రభుత్వం నియమించింది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంతే. ఎందుకంటే సలహాదారుల మాట శాఖల్లో ఉన్నతాధికారులు పెద్దగా వినేదుండదు. అలాగే తమ నియామకానికి న్యాయంచేస్తు ఏదైనా పాలసీని తయారుచేసి వివరిద్దామంటే జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోరు. కాబట్టే సలహాదారులు ప్రభుత్వానికి భారమవుతున్నారనే అనుకోవాలి.