యువజన శృంగార రసిక చిలిపి పార్టీ: బుద్ధా వెంకన్న

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ న్యూడ్ వీడియో కాల్ లో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ అని టీడీపీ నేతలు, విపక్ష నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే, అది మార్ఫింగ్ వీడియో అని, టీడీపీ నేతలు తనను అప్రతిష్టపాలు చేసేందుకు అలా చేశారని గోరంట్ల మాధవ్ ఆరోపిస్తున్నారు.

అయితే, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంబటి రాంబాబు ఆడియో లీక్, ఆ తర్వాత మంత్రి అవంతి వాయిస్ కాల్ వ్యవహారం, తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ తతంగం నేపథ్యంలో వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్సార్ సీపీకి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కొత్త అర్థం చెబుతూ సెటైర్లు వేస్తున్నారు. ‘యువ‌జ‌న శృంగార ర‌సిక చిలిపి పార్టీ’ పేరును సార్థ‌కం చేసే మ‌రో ట్రెండ్ సెట్ట‌ర్ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ అని బుద్ధా ఎద్దేవా చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అవంతి అరగంట స‌ర‌సం, అంబ‌టి గంట విర‌హం ఆడియోలు బ‌య‌టకొచ్చాయని, కానీ, వారిపై జ‌గ‌న్‌రెడ్డి ఏం చ‌ర్య‌లు తీసుకోలేదని బుద్ధా విమర్శించారు. పార్టీ బ్రాండింగ్ ఈ టైప్ రాస‌లీల‌లు బ‌య‌ట‌పెట్టుకుంటేనే అధినేత గుర్తిస్తున్నార‌ని గోరంట్ల మాధ‌వ్ న్యూడ్‌ వీడియో వ‌దిలారని చురకలంటించారు. ఈ ఎంపీపై జగన్ చ‌ర్య‌లు తీసుకుంటారో లేక అంబ‌టిలా మంత్రి ప‌ద‌విచ్చి గౌర‌విస్తారో చూద్దామంటూ పంచ్ లు వేశారు.

ఇక, ఈ న్యూడ్ వీడియో వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు, ఆయన తనయుుడు విజయ్ ల పాత్ర ఉందని గోరంట్ల మాధవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పై, గోరంట్ల మాధవ్ పై అయ్యన్న మండిపడ్డారు. వైసీపీ నేత‌లు మ‌ద‌మెక్కిన ఆంబోతుల్లా ఊరిమీద ప‌డి మ‌హిళ‌ల మాన‌ప్రాణాలు తీస్తుంటే…వారిపై జగన్ క‌నీస చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేదని అయ్యన్న దుయ్యబట్టారు.

అంతేకాదు, మ‌హిళ‌లపై లైంగిక‌దాడుల‌కు పాల్ప‌డిన‌వారికి మంత్రి ప‌ద‌వులను జగన్ క‌ట్ట‌బెడుతున్నారన్నారని, వైకామ‌కేయుల్ని ఊరి మీదకి వ‌దిలి దిక్కులేని దిశ‌ చ‌ట్టం తెచ్చారని ఎద్దేవా చేశారు. ఇటువంటి నేతల పాలనలో మ‌హిళ‌ల‌కు ఇంకెక్క‌డ ర‌క్ష‌ణ‌ ఉంటుందని ప్రశ్నించారు.