కోమటిరెడ్డి రాజగోపాల్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేయటాన్ని అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తట్టుకోలేకపోతున్నారా? తాజాగా రేవంత్ విషయమై వెంకటరెడ్డి చేసిన డిమాండ్లు చూస్తే అందరికి ఇదే అనుమానం పెరిగిపోతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేసిన దారుణమైన కామెంట్లకు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానికి రేవంత్ ఆరోపణలు చేసింది కేవలం తమ్ముడు రాజగోపాల్ మీదేకానీ అన్న, దమ్ములు ఇద్దరినీ కలిపికాదు.
రాజగోపాల్ మీడియా సమావేశంలో రేవంత్ పై ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు కాబట్టే రేవంతే కూడా అంతే స్ధాయిలో రాజగోపాల్ పై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఇంతోటి దానికే మధ్యలో వెంకటరెడ్డి కలగజేసుకుని రేవంత్ పై రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ టీడీపీలో కీలకంగా ఉండి కాంగ్రెస్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే.
కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు మాట్లాడినా రేవంత్ ను టార్గెట్ చేసుకుని ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. రేవంత్-రాజగోపాల్ వ్యవహారంలో వెంకటరెడ్డి తమ్ముడికి మద్దతుగా నిలబడటంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తమ్ముడి బాటలోనే అన్న కూడా ప్రయాణించటం ఖాయమేనా అని అనిపిస్తోంది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అవటాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ తట్టుకోలేకపోతున్న విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్ తో తమకున్న బంధాన్ని వెంకటరెడ్డి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
కాకపోతే బ్రదర్స్ ఇద్దరు నిత్య అసమ్మతి వాదులుగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. తాము కోరుకున్నట్లుగా పార్టీ ఉంటే సరి లేకపోతే రచ్చ మొదలుపెట్టేస్తారు. తాము కోరుకున్న పదవి దక్కక పోతే ఎంత గోల చేస్తారో పీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనే అందరూ చూశారు. ఒకవైపు మునుగోడు ఉపఎన్నిక ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో వెంకటరెడ్డి మొదలుపెట్టిన కొత్త పంచాయితీ ఆశ్చర్యంగా ఉంది. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ అభ్యర్ధి విజయానికి వెంకటరెడ్డి పనిచేయటం డౌటుగానే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates