రామోజీ దృతరాష్ట్రుడు: శ్రీకాంత్ రెడ్డి

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని…. జగన్ ప్రజారంజక పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంపై, జగన్ పై ఎల్లో మీడియాకు చెందిన కొన్ని పత్రికలు, చానెళ్లు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 108 వాహనాల కొనుగోలులో 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ టీడీపీ నేతలు బురదజల్లుదున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికలో వైసీపీపై విషం చిమ్ముతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఈనాడులో వార్తలు రాస్తున్నారని, రామోజీరావు ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దని హితవు పలికారు.

పార్టీ, కులం, మతం చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని, చెప్పని చాలా హామీలను అమలు చేస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓ వైపు కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటూనే….మరో వైపు సంక్షేమ పథకాల కోసం గత 6 నెలల్లో రూ.28,122 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఇవేమీ రామోజీరావుకు పట్టవని, ఈనాడులో అసత్య వార్తలు వస్తున్నా…కళ్లు మూసుకున్నారని మండిపడ్డారు. కరోనాకు సంబంధించిన వార్తల్లో ఏపీకి సంబంధించి ఒకలా, తెలంగాణకు సంబంధించి మరోలా ఈనాడులో వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను ఈనాడు, ఎల్లో మీడియా తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.జగన్ పాలనను టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, కరోనా విపత్తు సమయంలోనూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం దారుణమని మండిపడ్డారు. 108, 104లను టీడీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఇపుడేమో 108 వాహనాల్లో రూ. 300 కోట్ల అవినీతి అని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనపై ప్రజలంతా సంతృప్తితో ఉన్నారని…. జగన్ ప్రజాదరణ ముందు టీడీపీ మట్టికొట్టుకొనిపోతుందని అన్నారు.