ఏపీ సీఎం జగన్ తాను ప్రవేశపెట్టిన నవ రత్నాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న ప్లీనరీ వేదికగా తాను చేస్తున్న అప్పులపై జగన్ స్పందించారు. చంద్రబాబుతో పోలిస్తే తాను చేస్తున్న అప్పులు తక్కువేనని జగన్ స్పష్టం చేశారు.
గతంలో కూడా దాదాపుగా ఇదే బడ్జెట్ అని, అప్పుడు చంద్రబాబు సీఎం అని, ఇప్పుడు కూడా ఇదే బడ్జెట్ అని…సీఎం జగన్ అని చెప్పారు. అప్పుల విషయానికి వస్తే చంద్రబాబే జగన్ కన్నా ఎక్కువ అప్పులు చేశారని చెప్పారు. అప్పుడు వాళ్లెందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయారు..ఇప్పుడు జగన్ ఎలా చేయగలుగుతున్నాడు అని జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఒక బటన్ నొక్కితే చాలని, నేరుగా అక్కచెల్లెమ్మలు, అన్నల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు.
ఎక్కడా లంచాలు లేవు..ఎక్కడా వివక్ష లేదు..అందుకే పథకాలు అమలు చేయగలుగుతున్నానని అన్నారు. చంద్రబాబు హయాంలో బటన్లు లేవు..నొక్కేది లేదు…నేరుగా దోచుకో…పంచుకో..అని ఎద్దేవా చేశారు. ఇంత ఈనాడు, అంత ఏబీఎన్, మరికొంత టీవీ5, ఇంకొంత దత్తపుత్రుడు, మిగిలింది చంద్రబాబుకు…అందుకే పథకాలు తనలా అమలు చేయలేదని, గజదొంగల ముఠాకు మంచి పాలనకు మధ్య తేడాను గమనించాలని కోరారు.
వైసీపీ నేతలంతా జనం ఇంట ఉన్నారని, జనం గుండెల్లో ఉన్నారని, గజదొంగల ముఠా మాత్రం ఎల్లో టీవీలలో, ఎల్లో పేపర్లలో, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే ఉందని చెప్పారు. వారికి తమకు పోలిక లేదని, తమ చేతల పాలనకు, వారి చేతగాని పాలనకూ మధ్య పోటీ లేదని అన్నారు. మన నిజాలకు వారి అబద్దాలకు మధ్య పోటీనా ? మన నిజాయితీకి వారి వంచనకు మధ్య పోటీనా? అని ప్రశ్నించారు. పచ్చి అబద్దాలతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates