రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు.
తన కుమారుడి జేబులో ఉన్న కోడికత్తిని పోలిన చిన్నపాటి పనిముట్టు.. పొరపాటున జగన్ చేతికి గీసుకుపోయిందని తెలిపారు. దీన్ని పెద్ద రాద్దంతం చేస్తూ తన కుమారుడిపై హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారని.. 4 ఏళ్లుగా ఎలాంటి విచారణ జరపకుండా జైలులోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఈ కేసు విచారణ జరిపి.. తన కుమారుడు శ్రీనివాస్‌ను విడుదల చేయాలని కోరారు.
2019లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. అక్టోబరు 25న హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఓ యవకుడు ఒక్కసారిగా కోడి పందేల్లో వాడే కత్తితో జగన్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates