ఆప్ కు పెద్ద షాకిచ్చిన పంజాబ్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి పంజాబ్ ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. తాజగా సింగ్రూర్ పార్లమెంటుకు జరిగిన ఉపఎన్నికలో ఆప్ పార్టీ అభ్యర్ధి ఓడిపోయారు. నెలల క్రితమే పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బాగానే పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి నియంత్రణకు, డ్రగ్ మాఫియా, గ్యాంగస్టర్లను ఏరేయటానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

అవినీతిని కంట్రోల్ చేయటంలో భాగంగా తన క్యాబినెట్లోని మంత్రిపైనే కేసు నమోదుచేయించి అరెస్టు చేయించి జైలుకే పంపారు. దాంతో ఆప్ ప్రభుత్వం క్రెడిబులిటి అమాంతం పెరిగిపోయింది. 2014, 2019లో సింగ్రూర్ నుండి ఎంపీగా భగవంత్ మానే ఎంపికయ్యారు. ఇపుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రయ్యారు కాబట్టి ఎంపీగా రాజీనామా చేశారు. దాంతో ఇక్కడ ఉపఎన్నిక అవసరమైంది.

నిజానికి ఈ ఎన్నికలో ఆప్ అభ్యర్ధి గుర్మైల్ సింగ్ గెలుపు నల్లేరుమీద నడకే అని అందరు అనుకున్నారు. ఎందుకంటే సింగ్రూర్ సీటు ముఖ్యమంత్రి రాజీనామా చేసిన సీటు కాబట్టి, సీఎంగా మాన్ కు మంచిమార్కులే పడుతున్నాయి కాబట్టి గెలుపు చాలా ఈజీ అనుకున్నారు. కానీ ఫలతాలు చూస్తే పెద్ద షాకే తగిలింది. ప్రత్యర్ధిగా పోటీచేసిన వారిలో సిరోమణి అకాలీదళ్(అమృతసర్) అభ్యర్ధి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ 5,822 ఓట్ల మెజారిటితో గెలిచారు.

కాంగ్రెస్ అభ్యర్ధి మూడోస్ధానానికి, అకాలీదళ్ అభ్యర్ధికి 5వ స్ధానానికి పడిపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో 5 వేలతో గెలుపంటే పెద్ద మెజారిటీ ఏమీకాదన్న విషయం తెలిసిందే. కానీ ఒక్క ఓటుతో అయినా గెలుపు గెలుపే కదా. అందులోను అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆప్ లోక్ సభ ఉపఎన్నికలో ఓడిపోవటం భగవంత్ మాన్ తో పాటు ఇతర నేతలకు మింగుడుపడని విషయమే.