‘ఏపీని బాగు చేస్తా.. అవ‌కాశం ఇవ్వండి’

ఏపీలో జ‌గ‌న్ పాల‌న విధ్వంసాల‌కు నిల‌యంగా మారింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విజ‌య‌నగ‌రం లో ప‌ర్య‌టించిన ఆయ‌న తొలుత రోడ్ షో నిర్వ‌హించారు. అనంత‌రం నెల్లిమ‌ర్ల సెంట‌ర్‌లో టీడీపీ నేత‌లు నిర్వ‌హించిన స‌మావేశం లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని.. ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. మళ్లీ ఎపికి పునర్నిర్మాణం చెయ్యాలి….దానికి నేను సిద్దంగా ఉన్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌జ‌లు ఆలోచించి ఓటేయాల‌ని అన్నారు. ఏపీని బాగు చేసేందుకు తాను అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని చెప్పారు.

2019 లో తిరిగి టిడిపి గెలిచి ఉంటే దేశంలో అభివృద్దిలో ప్రధమ రాష్ట్రంగా ఉండేదని చంద్ర‌బాబు చెప్పారు. అనేక రూపాల్లో పెట్టుబడులు తెచ్చామ‌ని.. అవ‌న్నీ ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న చూసి.. వెన‌క్కి పోయాయ‌ని అన్నారు. ఆటోడ్రైవర్ల నుంచి ఉపాధి కూలీల వరకు ఎవరూ బాగోలేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి లాంటి వారిపై కేసులు పెడతారా? ఆయ‌న చేసిన త‌ప్పేంటి? అని నిల‌దీశారు. రామతీర్థం వస్తే మాపై కేసులు పెడతావా….మీ గుండెల్లో నిద్రపోతా! అంటూ.. సీఎం జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు.

మ‌నం కట్టిన టిడ్కో ఇళ్లు ఇచ్చారా.. 90 శాతం పూర్తి అయిన ఇళ్లు కూడా పూర్తి చెయ్యలేదు. నాకు సిఎం పదవి కొత్తకాదు.. ఇంటికొకరు ముందుకు రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఆనాడు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు.. రాష్ట్రం కోసం ఏదో మేలు జరగాలనే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. ఈ రాష్ట్రాన్ని బాగుచేసే శక్తి సామర్థ్యతో పాటు బాధ్యత నాకు ఉంది. పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్ అయ్యేలా పని చేస్తా. ఈ సారి టీడీపీకే ఓటేయండి! అని చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే.. తాను ఆత్మ విశ్వాసం ఇచ్చానని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ మద్దతు దారులు అని పెన్షన్ తీసివేసినా…పథకాలు తీసివేసినా కోర్టులో కేసులు వేసి న్యాయం చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. కాగా, చంద్ర‌బాబు రాక‌తో విజ‌య‌నగ‌రం టీడీపీలో కొత్త శోభ తెర‌మీదికి వ‌చ్చింది. భారీ ఎత్తున నాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు.. చంద్ర‌బాబు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రోడ్ షోలో విరివిగా పాల్గొన్నారు. దీంతో చంద్ర‌బాబు అమితానందం వ్య‌క్తం చేశారు. త‌మ్ముళ్లూ.. ఇదే జోష్ వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగించండి! అని ఆయ‌న పిలుపునిచ్చారు.