ఏపీలో రాజ‌కీయ యాత్ర‌లు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్‌

ఏపీలో ఎన్నిక‌ల ర‌చ్చ మామూలుగా లేదుగా.. అనే మాట వినిపిస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించిన అన్ని ప్ర‌ధాన పార్టీలు.. అప్పుడే వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను తెర‌మీదికి తెచ్చాయి. నిజానికి ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం అంటే.. పెద్ద‌గా ఎలాంటి ఊపు క‌నిపించ‌దు. కానీ, ఏపీలో మాత్రం ప‌రిస్తితి దీనికి భిన్నంగా ఉంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. టీడీపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. మ‌రోవైపు.. అధికార పార్టీ వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌పకు అంటూ.. ప్ర‌జల్లోకి అడుగులు వేస్తోంది. ఇది చాల‌ద‌న్న‌ట్టుగా.. మంత్రుల‌తో బ‌స్సు యాత్ర‌లు కూడా చేయిస్తోంది. అంటే. దాదాపు సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ..  రాజ‌కీయాలు.. వేడెక్కాయి.  

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు.. అవ‌స‌ర‌మైన వ్యూహ‌ర‌చ‌న చేసేందుకు టీడీపీ రెడీ అయింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2024లో విజ‌యం ద‌క్కించుకునే ల‌క్ష్యాన్ని పార్టీ ఏర్పాటు చేసుకుంది. మ‌రోవైపు.. మ‌ళ్లీ అధికారం ద‌క్కించుకుని తీరాల‌నే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌ కేబినెట్‌లోని మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేప‌ట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్ర చేస్తున్నారు. సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రుల బస్సు యాత్రకు ఉపక్రమించారు. గడపగడపకు కొనసాగుతున్న యాత్ర‌కు ఇది స్పెష‌ల్ అన్న‌మాట‌.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు జిల్లాల యాత్ర‌లు చేశారు. ప్ర‌జ‌ల‌ను క‌లిశారు. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందునుంచి ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. గ‌తానికి ఇప్ప‌టికి ఏపీలో రాజ‌కీయాలు మారిపోయాయి.  టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న జిల్లాల యాత్ర‌కు అనూహ్యమైన స్పంద‌న వ‌స్తోంది. ఆయ‌న ఎక్కడికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఎవ‌రికి వారు.. చంద్ర‌బాబు రాక‌కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాల్లో పార్టీనిగాడిలో పెట్టేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ఈ యాత్ర‌లు స‌క్సెస్ రేటును పెంచుతున్నాయ న‌డంలో సందేహం లేదు.

ఈ రెండు పార్టీల ప‌రిస్థితి ఇలా ఉంటే.. మ‌రోవైపు.. జ‌న‌సేన కూడా త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లను క‌లిసేందుకు రెడీ అవుతోంది. త్వ‌ర‌లోనే యాత్ర చేయ‌నున్న‌ట్టు జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇలా మొత్తంగా చూస్తే.. రాష్ట్రం సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మరానికి రెండేళ్ల ముందుగానే రాజ‌కీయ కోలాహ‌లం.. యాత్రా స్పెష‌ల్స్ ప్రారంభం అయిపోతున్నాయి. గెలుపు ఎవ‌రిది అనేది ప‌క్కన పెడితే.. ప్ర‌తిప‌క్షాలకు దీటుగా అధికార పార్టీ కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. నిజానికి ఎన్నిక‌లు ముందు వ‌ర‌కు కూడా ప్ర‌తిప‌క్షాలు దూకుడుగా ఉండ‌డం.. అధికార ప‌క్షం నిల‌క‌డ‌గా ఉండ‌డం వంటివి తెలిసిందే. కానీ, ఏపీలో మాత్రం రివ‌ర్స్ అయింది.

ప్ర‌తిప‌క్షాల‌కు దీటుగా అధికార ప‌క్షం కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయింది. ఇక‌, ఎన్నిక‌ల విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఎవ‌రు ఎన్ని పార్టీల‌తో క‌లిసినా.. తాము ఒంట‌రిగానే పోరాడ‌తామ‌ని.. వైసీపీ చెబుతోంది. అయితే.. ఇటు జ‌న‌సేన అటు టీడీపీలు క‌లుసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. వైసీపీ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల‌నివ్వ‌కుండా చూస్తానంటూ.. ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌టన ఆద్యంతం ఆస‌క్తిగా మారింది. దీంతో స‌హ‌జంగానే వైసీపీ ఇబ్బందుల్లో ప‌డింది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు యాత్ర‌ల‌ను ముమ్మ‌రం చేసింది. ఏదేమైనా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ యాత్ర‌లు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.