కేసీఆర్ తలచుకుంటే పెట్రోలు రూ.89కే ఇవ్వచ్చు – బండి

పెట్రో వివాదంలో మెల్ల‌గా కేసీఆర్ ను లాక్కొచ్చారు బండి సంజయ్. కేసీఆర్ అనుకుంటే లీట‌రు పెట్రోలును 80 రూపాయ‌ల‌కే ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారాయ‌న. నిజంగానే ఇది సాధ్య‌మా అంటే ! రాష్ట్రాలు త‌మ ప‌న్నుల వాటాను త‌గ్గించుకుంటే సాధ్య‌మే అంటున్నాయి బీజేపీ వ‌ర్గాలు. దీంతో ఈ వివాదం మ‌రో మ‌లుపు తీసుకుంది. ఇప్ప‌టికే బీజేపీకీ, టీఆర్ఎస్ కూ వివాదం ర‌గులుతున్న నేప‌థ్యంలో బండి సంజయ్ చెప్పే మాట‌లు లేదా చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి.

మ‌రోవైపు పెట్రో ధ‌ర‌ల త‌గ్గింపు అన్న‌ది పెద్ద‌గా ఏమీ లేద‌ని కాంగ్రెస్ పెదవి విరుపు విరుస్తోంది. సోష‌ల్ మీడియా వివరాలు అందిస్తోంది. 44 రూపాయ‌ల‌కు పైగా పెంచి, కేవ‌లం ఎనిమిది అంటే ఎనిమిది రూపాయ‌లు త‌గ్గించి కేంద్రం త‌న‌దైన రాజ‌కీయం చేస్తోంద‌ని అంటోంది. ఇక ఇవాళ హైద్రాబాద్ లో పెట్రోల్ ధ‌ర 109.67 రూపాయ‌లుగా ఉంది. డీజిల్ ధ‌ర 97.82 రూపాయ‌లుగా ఉంది. ఢిల్లీలో మాత్రం లీట‌రు పెట్రోలు ధ‌ర 96 రూపాయల 72 పైస‌లుగా ఉంది. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఢిల్లీలో మాత్రమే కాస్తో కూస్తో పెట్రో ధ‌ర త‌గ్గి ఉంది.

పొరుగున ఉన్న బెంగ‌ళూరులో 101 రూపాయ‌ల 94 పైస‌లుగా లీట‌రు పెట్రోలు ఉంది. అదేవిధంగా మ‌రో పొరుగు ప్రాంతం చెన్న య్ లో 102 రూపాయ‌ల 63 పైస‌లుగా ఉంది. ఏ విధంగా చూసుకున్నా హైద్రాబాద్ లో పెట్రో ధ‌ర దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్య న‌గ‌రాల క‌న్నా ఎక్కువ‌గానే ఉంది. మ‌రోవైపు కేంద్రం మాత్రం తాము ఎక్సైజ్ డ్యూటీ ద‌గ్గించ‌డం వ‌ల్ల ల‌క్ష కోట్ల న‌ష్టం వ‌స్తోంద‌ని అంటోంది. అంటే ప్ర‌జ‌ల కోసం ఈ సారి కేంద్రం చేస్తున్న త్యాగం విలువ ల‌క్ష కోట్లా అని.. విప‌క్షం పెద‌వి విరుస్తోంది. రాష్ట్రం వాటా కింద ఉన్న వ్యాట్ ముప్పై రూపాయ‌లుగా ఉంద‌ని, దానిని త‌గ్గిస్తే 80 కే ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటోంది తెలంగాణ బీజేపీ.