వైసీపీ తరఫున నరసాపురం నుండి గెలుపొందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వివిధ సందర్భాల్లో పార్టీ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు అంశాల్లో ఆయన తన వైఖరిని సూటిగా చెప్పేస్తుండటంతో పార్టీకి, ఆయనకు మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవల ఆయన మరో అడుగు ముందుకేసి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. తనను చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. హోంమంత్రికి కూడా లేఖ రాశారు.
అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి, స్థానిక పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది తన దిష్టిబొమ్మను తగులబెట్టి, ఫ్లెక్సీలను టమాటాలు, కోడిగుట్లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా ఆయన ఢిల్లీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామని బెదిరించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇలాంటి టెన్షన్ పరిస్థితుల్లో ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, కేవలం ఫిర్యాదు చేసేందుకే వెళ్తున్నారా? ఇంకేదైనా కారణముందా అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీకి పయనమవుతున్న ఆయన లోకసభ స్పీకర్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారని తెలుస్తోంది. అపాయింట్మెంట్ ఖరారయిందని చెబుతున్నారు. వైసీపీతో దూరం.. బీజేపీ నేతలకు దగ్గర కావడం వైసీపీ క్యాడర్లో ఆందోళన కలిగిస్తోందట. వైసీపీ, టీడీపీ, జనసేనలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోన్న బీజేపీ ఏపిలో కొత్త అధ్యక్షుడి కోసం చాలా రోజులుగా వెతుకులాట ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోను ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates