ఇదేం రాజ‌కీయం పేర్ని నాని ?

టీడీపీని కానీ జ‌న‌సేన‌ను కానీ తిట్టే ప్ర‌య‌త్నం చేయాలంటే ముందు వ‌రుస‌లో ఉండే వ్య‌క్తి పేర్ని నాని. అదేవిధంగా ఆయ‌న మాట‌లు కూడా చాలా వ్యంగ్యార్థాల‌తో కూడుకునే ఉంటాయి. పొత్తుల‌పై అధినేత క్లారిటీ ఇవ్వ‌కున్నా  పేర్ని నాని మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. ఆ విధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌ల‌వ‌బోమ‌ని చెప్పిన పేర్ని నాని, రాజ‌కీయాల్లో మ‌ళ్లీ యాక్టివ్ అయ్యేందుకు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. చంద్ర‌బాబును మ‌రియు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన‌ప్పుడు వ్యంగ్యంతో , చిరు పేరు చెప్ప‌గానే ప్ర‌స‌న్న వ‌దనంతో మాట్లాడ‌డం ఆయ‌నకే చెల్లు. ఆ విధంగా ఆయ‌న రాజ‌కీయం ప్ర‌త్యేకం. ఆయ‌న కూడా ప్ర‌త్యేక‌మే !

రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక మెగాస్టార్ క‌న్నా మించిన న‌టులు ఉన్నారు. ఉండాలి కూడా ! రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ర‌జ‌నీకి మించిన పంచ్ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది క‌నుక ఆ విధంగా కూడా చాలా మంది ఉన్నారు. ఉండాలి కూడా ! అదేవిధంగా రాజ‌కీయం ఎలా ఉన్నా రాణించాలి అన్న త‌లంపుతో కేవ‌లం త‌మ విధానాల‌కే క‌ట్టుబ‌డి ప‌నిచేసిన వాళ్లు ఉన్నారు. వాళ్లు ఉండాలి కూడా ! సైద్ధాంతికంగా ఓ పార్టీ ఎలా ఉన్నా కూడా ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ ను పెంచుకునే క్ర‌మంలో కొంద‌రు ప‌నిచేస్తారు. కొంద‌రు పార్టీ నాయ‌కుల‌ను క‌లుపుకుని, ప్రాంతాల‌క‌తీతంగా ప‌నిచేస్తారు. కొందరు విశ్లేష‌కులుగా ఉంటూ పార్టీల‌కు అతీతంగా స్నేహాలు చేస్తారు.

కానీ కొంద‌రే మ‌రికొన్ని న‌మ్మ‌కాల‌కు కట్టుబ‌డి ఉంటారు. ఆ విధంగా జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని నెర‌వేరుస్తున్న ఏకైక వ్య‌క్తి పేర్ని నాని. విప‌క్షాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు కూడా మాట్లాడున్నారు ఈ మాజీ మంత్రి. మాజీ మంత్రులంతా సైలెంట్ అయిపోయినా కూడా పేర్ని నాని మాత్రం త‌న‌దైన శైలిలో విప‌క్షాల‌కు కౌంట‌ర్లు ఇస్తూనే ఉంటారు. ఆ విధంగా ఆయ‌న ప్ర‌భు భ‌క్తి చాటుకుంటూ ఉంటారు. వాస్త‌వానికి ఏపీ మంత్రులెవ్వ‌రూ కూడా ఈ రోజు ప్ర‌జ‌ల కోసం కాకుండా కేవ‌లం విప‌క్షాల కోస‌మే ప‌నిచేస్తున్న విధంగా ఉన్నారు. వారికి జ‌త‌గా పేర్నినాని ఉన్నారు. ఉంటారు కూడా ! గొప్ప రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న ఎందుక‌నో జ‌గ‌న్ విష‌యంలో మాత్రం వీర‌విధేయ‌త‌కు తార్కాణంగా నిలుస్తుంటారు.

మెగాస్టార్ ను అదే ప‌నిగా పొగిడి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తిడుతుంటారు. ఆ విధంగా విభిన్న రాజ‌కీయం ఒక‌టి న‌డిపిస్తుంటారు. ప్ర‌స్తుతం ఉన్న మాజీ మంత్రుల‌లో కొడాలి నాని ఆ రోజు మాట్లాడినంత ఇప్పుడు మాట్లాడ‌రు. అదేవిధంగా అవంతి కూడా మాట్లాడ‌రు. కానీ ప‌వ‌న్ పేరెత్తితే చాలు పేర్నినాని నోటికి వ‌చ్చిందంతా సెటైర్ల రూపంలో మార్చి ఆ మీట‌ర్ కు అనుగుణంగా మాట్లాడుతుంటారు.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో అనూహ్యంగా ఎదిగి అనూహ్యంగానే ప‌ద‌వీచ్యితుడ‌యిన పేర్ని నాని గ‌తం క‌న్నా భిన్నంగా ఏమీ లేరు. ఇక‌పై ఉండ‌రు కూడా ! తామంతా జ‌గ‌న్ బొమ్మ‌తోనే గెలిచాం అన్న భావ‌న‌తో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ ఏ విధంగా మాట్లాడ‌తారో ఈయ‌న కూడా అంతే స్థాయిలో మాట్లాడేందుకు ప్రయ‌త్నిస్తుంటారు. మంత్రులు ఎవ్వ‌రైనా స‌రే జ‌గ‌న్ కు విధేయులుగా ఉండ‌డం బాగుంది కానీ మాజీ మంత్రులు కూడా  అదే కోవ‌లో ఉంటూ ఆ నాడు త‌మ‌కు ప‌ద‌వి ఇచ్చినందుకు ఇప్ప‌టికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటూ, జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను తిట్టి పోస్తూ ఉంటారు.