జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తాజా మంత్రులతో పాటు మాజీ మంత్రి కూడా జోరు పెంచారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పవన్ ను చంద్రబాబునాయుడు బానిసగా అభివర్ణించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయటం కోసమే పవన్ కష్టపడుతున్నట్లు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీద చూపించే ప్రేమలో కొంతైనా సోదరుడు చిరంజీవి మీద చూపిస్తే బాగుంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు. పవన్ టార్గెట్ గా మంత్రులు, వైసీపీ నేతలు రెచ్చిపోతున్న విషయం అందరికీ తెలిసిందే.
జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్-2లో చోటు దక్కిన గుడివాడ అమర్ నాథ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా కూడా పవన్ పై రెచ్చిపోతున్నారు. వీళ్ళు ముగ్గురు తమ శాఖలపై సమీక్షలు నిర్వహించటం, క్షేత్రస్థాయి పర్యటనలు చేయటం, శాఖలపై పట్టు సాధించడం కన్నా పవన్ పై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనబడుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే పవన్ కు తాజా, మాజీలే ఎక్కువ ప్రచారం ఇస్తున్నారు.
అధికారంలోకి వచ్చేంత సీన్ చంద్రబాబు+పవన్ కు లేదని చెబుతున్న మంత్రులు మళ్ళీ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదు. మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముందు తమ శాఖల పనితీరుపైన దృష్టిపెట్టాలి. ఆ తర్వాతే తమ శాఖల ద్వారా ప్రజలకు చేయబోయే మేలు గురించి ప్రస్తావించాలి. అంతేకానీ ఎలాంటి ఉపయోగం లేని రాజకీయ ఆరోపణలు, విమర్శలకు విలువైన కాలాన్ని వెచ్చించటం వల్ల ఉపయోగమే లేదు.
పవన్ ని పట్టుకుని చంద్రబాబుకు బానిసన్నా, యజమాని అన్నా పవన్ కు కానీ లేదా చంద్రబాబుకు కానీ జరిగే లాభమూ లేదు నష్టమూ లేదు. అనవసరంగా వాళ్ళద్దరికి ప్రచారం కల్పించటం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. పేర్ని నాని ఎలాగూ మాజీ అయిపోయారు కాబట్టి ముందు జిల్లాలో పార్టీ బలోపేతం చేయటం, ఎంఎల్ఏలు నేతల మధ్య ఎక్కడన్నా సమస్యలుంటే వాటిని సర్దుబాటు చేయటంపైన దృష్టిపెడితే బాగుంటంది. సమయం, సందర్భం వచ్చినపుడు ఎలాగూ ప్రతిపక్షాలపై అందరు విరుచుకుపడుతునే ఉన్నారు. మధ్యలో అనవసరమైన మాటలెందుకో అర్ధం కావటంలేదు.