ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నంతనే అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదంటే ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తప్పించి మరే నేత ప్రధాన మీడియాకు కనిపించదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎవరెన్ని చెప్పినా ఏపీ మీడియాలో రెండు పెద్ద కుంపట్ల ఉన్నాయని చెప్పాలి. ఈ కుంపట్లు జగన్.. చంద్రబాబు ఆప్షన్ లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవటమే తప్పించి.. అందుకు భిన్నంగా ఏపీకి మేలు చేస్తున్నవారు.. కష్టంలో ఉన్న వారికి సహాయక చర్యలు చేపట్టేవారి గురించి ప్రధాన మీడియాకు పట్టదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
నిత్యం ఏపీ అధికార.. విపక్షాల మధ్య సాగే పోరు.. దానికి సంబంధించిన రాజకీయ పరిణామాలు మాత్రమే అన్నట్లుగా ఏపీ మీడియా నడుస్తోంది. రాజకీయ పోరు మొత్తం రెండు ప్రధాన పార్టీల మధ్య సాగుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారే తప్పించి.. మంచి.. చెడు విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. తరచి చూస్తే.. ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులు.. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక్కరంటే ఒక్కరికి పట్టని పరిస్థితి.
ఇలాంటి వేళ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి.. కౌలు రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్న ప్రాంతాల్ని గుర్తించటం.. వారి వద్దకు తానే వెళ్లేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకొన్న పవన్.. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు నడుస్తున్న రాజకీయానికి భిన్నంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ పై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించాల్సిన అవసరం లేదు. కనీసం పవన్ రైతు భరోసా యాత్రను కాస్తంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఏపీ అంటే జగన్.. చంద్రబాబు మాత్రమే కాదు.. చాలామంది నేతలు ఉన్నారన్న విషయాన్ని ఇరు వర్గాలకు చెందిన మీడియా సంస్థలు.. వారి ఫాలో అప్ గా ఉండే సంస్థలకు పవన్ లాంటి వాళ్లు పట్టటం లేదన్న అభిప్రాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ తరహా మీడియా.. తన గౌరవాన్ని తాను తగ్గించుకోవటం తప్పించి మరింకేమీ లేదంటున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఫోకస్ చేయటం ద్వారా.. కౌలు రైతుల ఆత్మహత్యల ఇష్యూను ప్రభుత్వ ప్రాధామ్యాయ అంశంగా మార్చాల్సిన అవసరం ఉంది. కానీ.. ఏపీలోని మీడియాను చూసినప్పుడు అలాంటి సోయి లేదన్నట్లుగా ఉంది. ఒకవేళ ఉంటే.. పవన్ యాత్రను ఎందుకు హైలెట్ చేయటం లేదన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిందెవరు?