తాజాగా జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా నియమించిన సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తల విషయాన్ని చూస్తే పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. అలాగే ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. సమన్వయకర్తలుగా, ప్రాతీయ సమన్వయకర్తలుగా మాజీమంత్రులు, ఇతర నేతలను నియమించినప్పటికీ తండ్రి, కొడుకులకు దక్కినంత ప్రాదాన్యత ఇంకెవరికీ దక్కలేదు.
రీజనల్ కో ఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా నియమించారు. నాలుగు జిల్లాల పరిధిలో 27 నియోజకవర్గాలున్నాయి. అలాగే మిధున్ రెడ్డికి ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని 5 జిల్లాలున్నాయి. వీటిపరిధిలో 35 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అంటే తండ్రి, కొడుకుల చేతిలో 9 జిల్లాలు, వాటి పరిధిలోని 62 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 62 అసెంబ్లీ నియోజకవర్గాలంటే ఎలాగూ దాదాపు 9 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా కవరవుతాయి.
62 అసెంబ్లీ, తొమ్మిది లోక్ సభ నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయటమంటే మామూలు విషయంకాదు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే అందులో 62 నియోజకవర్గాలకు తండ్రి, కొడుకులనే బాధ్యులుగా జగన్ నియమించారు. మిగిలిన సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తలకు మహాఅయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటిరెండు పార్లమెంటు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి.తండ్రి, కొడుకులకు ఇంత పెద్ద బాధ్యతలను జగన్ ఎందుకు అప్పగించినట్లు ?
ఎందుకు అప్పగించారంటే గతంలో కూడా మంత్రి పెద్దిరెడ్డి కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఇన్చార్జిగా పనిచేశారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, కడప జిల్లాలకు ఇన్చార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. పైగా పై జిల్లాల ఎంఎల్ఏలు, నేతలతో మంచి సంబంధాలున్నాయి. పైగా అప్పటి ఇన్చార్జి బాధ్యతలను ఇద్దరు సక్రమంగా నిర్వర్తించారన్న పేరుంది. అందుకనే జిల్లాలను మార్చినా జగన్ మళ్ళీ తండ్రీ, కొడుకుల చేతిలో ఏకంగా 62 అసెంబ్లీ నియోజకవర్గాలను ఉంచారు. మరి ఈసారి వీళ్ళద్దరు ఏమి చేస్తారో చూడాల్సిందే.