క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. తమిళిసై మాట్లాడుతు కేసీయార్ తో పనిచేయటం కష్టమన్నారు. తాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు సీఎంలు కూడా భిన్న మనస్తత్వాలున్నవారని గవర్నర్ చెప్పటం విశేషం. కేసీయార్ తో కలిసి పనిచేయటం కష్టం అనేమాట గవర్నర్ అనకూడదు.
ఎందుకంటే గవర్నర్ అపాయింటైన వ్యక్తి అయితే కేసీయార్ ప్రజా ప్రతినిధి. కోట్లాదిమంది ప్రజలు ఎన్నిక చేసుకున్న పార్టీ అధినేతగా కేసీయార్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంతేకానీ తమిళిసైలా ఎక్కడి నుండి హఠాత్తుగా కేంద్రం నియమిస్తే తెలంగాణాలో ప్రత్యక్షంకాలేదు. ఉద్యమ నేపధ్యం నుండి వచ్చిన కేసీయార్ వ్యవహారశైలి కాస్త విలక్షణంగానే ఉంటుంది. అందుకనే కేసీయార్ ఆలోచనేలకు తగ్గట్లుగా గవర్నర్ వ్యవహార శైలిని మార్చుకోవాలి.
అలా మార్చుకోవటం కుదరనపుడు గవర్నర్ తాను చేయదలచుకున్నది చేయాలి. కేసీయార్ మీద ఫిర్యాదులు చేయటానికి ఎలాగూ కేంద్రం ఉన్నది. కాబట్టి కేసీయార్ వల్ల తనకు ఏవైనా ఇబ్బందులుంటే వాటిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. అంతిమ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. అంతేకానీ ప్రజాప్రతినిధి హోదాలో ముఖ్యమంత్రి అయిన కేసీయార్ తో పనిచేయటం కష్టమని చెప్పటం తప్పే.
కేసీయార్ తో పనిచేయటం కష్టమంటే ఆయన్ను ఎన్నుకున్న జనాలను గవర్నర్ తప్పుపడుతున్నట్లే అవుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు భిన్న మనస్తత్వం ఉన్నవారని గవర్నర్ అనటంలో కూడా అర్ధంలేదు. డాక్టర్ కూడా అయిన తమిళిసైకి ఏ ఇద్దరు మనుషుల మనస్తత్వాలు ఒకటి ఉండదని తెలీదా ? పాండిచ్చేరిలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి అక్కడ ఆమెకు సమస్యలు రావటంలేదు. కానీ తెలంగాణాలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. పైగా కేంద్రప్రభుత్వంపై కేసీయార్ రెచ్చిపోతున్నారు. కాబట్టి తెలంగాణాలో వ్యవహారాలు తమిళిసైకి మింగుడుపడటంలేదు. అంతమాత్రాన కేసీయార్ తో పనిచేయటం కష్టమని చెప్పటం కష్టమని చెప్పేస్తారా ? గవర్నర్ వ్యవహారం చూస్తే కేసీయార్ తో గొడవలకు సిద్ధమైనట్లే అనిపిస్తోంది. మరి రాజకీయాలు ఎక్కడకు దారితీస్తాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates