అమిత్ షా ఆప‌రేష‌న్ తెలంగాణ‌!

Amit Shah Corona

ఇటీవ‌ల నాలుగు రాష్ట్రాల్లో తిరిగి అధికారం నిల‌బెట్టుకున్న బీజేపీ జోష్‌లో ఉంది. ఇదే ఊపులో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించ‌నుంది. ముఖ్యంగా తెలంగాణ‌లో బ‌లోపేతం దిశ‌గా సాగుతున్న బీజేపీ అధికార‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. బీజేపీ అగ్ర నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఆప‌రేష‌న్ తెలంగాణ‌తో రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని స‌మాచారం. స్వ‌యంగా అమిత్ షా రంగంలో దిగ‌డంతో తెలంగాణ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

కేసీఆర్‌పై పోరు..
తెలంగాణ‌లో బీజేపీ ఎదుగుతుంద‌ని భావించిన కేసీఆర్‌.. కేంద్రంలోని ఆ పార్టీ ప్ర‌భుత్వంపై స‌మ‌ర‌శంఖం పూరించిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌ధాని మోడీని దేశం నుంచి త‌రిమేయాలంటూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నారు. తాజాగా యాసంగి వ‌రి కోనుగోళ్ల విష‌యంలో కేంద్రంపై పోరాటం చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ వ్యూహాల‌ను దీటుగా ఎదుర్కొనేందుకు బీజీపీ సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే మాట‌ల‌తో కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు రాష్ట్ర బీజేపీ నేత‌లు కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇప్పుడిక ఏకంగా అమిత్ షా బ‌రిలో దిగ‌బోతున్నార‌ని టాక్‌.

వ్యూహాల‌పై క‌స‌ర‌త్తు..
తెలంగాణ‌లో అధికారం ద‌క్కాలంటే ఏం చేయాల‌నే వ్యూహాల‌పై ఇప్ప‌టికే బీజేపీ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. టీఆర్ఎస్ బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌తో పాటు ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై అభిప్రాయాల కోసం స‌ర్వేలు చేయిస్తోంది. ఆ నివేదిక‌ల ఆధారంగా ఎక్క‌డికక్క‌డ నియోజ‌క‌వ‌ర్గం వారీగా వ్యూహాలు అమ‌లు చేయాల‌ని అమిత్ షా డిసైడ్ అయ్యార‌ని తెలిసింది. అందుకోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల్లో చురుగ్గా ఉన్న‌వాళ్ల‌ను, మంచి వాగ్ధాటి క‌లిగిన నాయ‌కుల‌ను ఎంపిక చేస్తున్నార‌ని టాక్‌.

వాళ్ల‌కు తెలంగాణ‌లో నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను అప్ప‌జెబుతార‌ని స‌మాచారం. ఒక్కో నేత‌కు మూడు నియోజ‌క‌వ‌ర్గాల చొప్పున అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది. అందు కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన దాదాపు 30 మంది నేత‌ల‌తో టీం రెడీ చేసిన‌ట్లు చెబుతున్నారు. మ‌రోవైపు స‌ర్వే ఫ‌లితాలు నేరుగా అమిత్ షా కార్యాల‌యానికి చేరేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు చేరిక‌ల‌కు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు టాక్‌. అంద‌రినీ ఒకే సారి కాకుండా సంద‌ర్భానికి అనుగుణంగా నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకోవాల‌ని ఆయ‌న సూచించార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.