ప్రశ్నించడమే తమ బలమైన ఆయుధమని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఇప్పటంలో జరుగు తున్న జనసేన 9వ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగించారు. తొలుత ప్రసంగం ప్రారంభిస్తూనే.. జై భారత్, జై ఆంధ్ర, జై తెలంగాణ అంటూ.. పవన్ జేజేలు పలికారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటంలో సభను పెట్టుకునేందుకు సహకరించిన రైతులకు, సభకు వచ్చిన అన్నదాతలకు కూడా పవన్ ధన్యవాదాలు, నమస్కారాలు తెలిపారు. ఇప్పటం గ్రామ పంచాయతీకి రూ.50 లక్షలను విరాళంగా తన సొంత నిధి నుంచి ఇవ్వనున్నట్టు పవన్ ప్రకటించారు.
ఇక, ఇతర పార్టీల నేతలకు కూడా పవన్ ఈ సభా వేదికగా నమస్కారాలు తెలిపారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు నమస్కారాలు చెప్పారు. అదేవిధంగా సీపీఎం, సీపీఐ, టీడీపీ, బీజేపీ నేతలకు కూడా పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని నమస్కారాలు చెబుతున్నట్టు తెలిపారు. వైసీపీలోనూ మంచి నాయకులు ఉన్నారంటూ.. ఇటీవల మృతి చెందిన మేకపాటి గౌతం రెడ్డి, ఆయన తండ్రి రాజమోహన్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆనం రామనారాయణ రెడ్డి వంటివారిని ఆయన ప్రస్తావించారు. ఇక, మంత్రి అవంతి శ్రీనివాస్‌పై తనదైన శైలిలో సటైర్లు వేశారు.
గోడకు కొట్టిన బంతి ఏదైనా తిరిగిరాదంటే.. అది అవంతి! అంటూ.. చురకలు అంటించారు. తాము అధికారం కోసం.. రాలేదని.. ప్రశ్నించేందుకు మాత్రమే వచ్చామని పవన్ స్పష్టం చేశారు. 2024లో ప్రభుత్వాన్ని స్తాపిస్తామని.. పవన్ సంచలన వ్యాఖ్య చేశారు. తమ పార్టీ ఓటు బ్యాంకు 7 శాతం నుంచి 24.7 శాతానికి పెరిగిందని చెప్పారు. ఏదైనా ప్రభుత్వం శుభకార్యాలతో పనులు ప్రారంభిస్తుందన్న పవన్.. వైసీపీ ప్రభుత్వం మాత్రం అశుభ కార్యాలతో పనులు ప్రారంభించిందని తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. తన ఎదుగుదలకు.. పార్టీ ఈ రేంజ్లో ఉండేందుకు.. తన అన్న నాగబాబే కారణమని పవన్ చెప్పారు.
ప్రశ్నించడం అంటే.. మార్పునకు శ్రీకారమని.. పవన్ పేర్కొన్నారు. తన పార్టీకి ప్రస్తుతం 46 లక్షల సభ్యత్వం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని.. కార్యకర్తలకు పవన్ సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక అరాచకాలు చోటు చేసుకున్నాయని.. ప్రభుత్వం వచ్చీ రావడంతోనే ఇసుకను నిలిపివేయడంతో.. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని.. ఫలితంగా 32 నిండు ప్రాణాలు పోయాయని.. వారంతా బలవన్మరణం చేసుకున్నారని.. పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన పార్టీ పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలిపారు.