పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా సభకో, వేడుకకో వచ్చాడంటే.. అక్కడ ఆయనతో పాటు ఉండాలని అభిమానులు కోరుకునే వ్యక్తి బండ్ల గణేష్. ఈ నటుడు, నిర్మాత పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. మామూలుగానే ఉన్న అభిమానం.. పవన్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు నిర్మించాక ఇంకెన్నో రెట్లు పెరిగింది. తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమైన స్థితిలో బండ్ల గణేష్ సాయపడ్డాడన్న కృతజ్ఞతతోనే పవన్ ఈ రెండు సినిమాలు అతడికి చేశాడంటారు.
కారణమేదైనా ఈ రెండు చిత్రాలు నిర్మించాక పవన్‌కు బండ్ల గణేష్ భక్తుడైపోయాడు. ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో గణేష్ ఇచ్చిన స్పీచ్ అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత గత ఏడాది ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇంకో బ్లాక్ బస్టర్ స్పీచ్ ఇచ్చాడు. ఎలివేషన్లతో నిండిపోయే ఇలాంటి స్పీచ్‌లు అభిమానులకు ఎంత నచ్చుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఇటీవల ‘భీమ్లా నాయక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం బండ్ల గణేష్ కనిపించలేదు. ఈ ఈవెంట్‌కు బండ్లను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారనే ప్రచారం జరిగింది.
ఈ విషయంలో త్రివిక్రమ్‌ను బండ్ల గణేష్ బూతులు తిట్టినట్లు ఒక ఆడియో కూడా వైరల్ అయింది. కట్ చేస్తే.. ఇప్పుడు బండ్ల గణేష్ అమరావతిలో సోమవారం జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు హాజరు కాబోతుండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా గణేషే ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘‘వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం’’ అంటూ ట్వీట్ వేశాడు బండ్ల.
బండ్ల వచ్చి పవన్‌కు ఎలివేషన్ ఇస్తూ అభిమానుల్లో, జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం తేవడం వరకు బాగానే ఉంటుంది కానీ.. ఇది రాజకీయ సభ కాబట్టి మరీ హద్దులు దాటిపోయి ఈ వేడుక కామెడీ అయిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా అతడిపై ఉంటుందని గుర్తుంచుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates