పంజాబ్ కూడా పాయే?

అధికారంలో లేని పార్టీలు ఎలాగైనా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి గ‌ద్దెనెక్కాల‌ని శ్ర‌మిస్తాయి. రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా పార్టీల ముఖ్య ల‌క్ష్యం ఇదే. కానీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా క‌నిపిస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో అధికారం ద‌క్క‌డం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. చేతిలో ఉన్న రాష్ట్రాల‌ను కూడా చేజాతులారా వ‌దిలేసుకోవ‌డం ఆ పార్టీకే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఎగ్జిట్ పోల్ స‌ర్వేల ప్ర‌కారం పంజాబ్ పీఠం ఆప్‌కు ద‌క్కుతుంద‌నే అంచ‌నాల నేప‌థ్యంలో కాంగ్రెస్ భ‌విష్య‌త్‌పై మ‌రిన్ని సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.

చూస్తూ ఉండిపోతే ఎలా?
ఒక‌ప్పుడు దేశంలో తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన హ‌స్తానికి ఇప్పుడు వాత‌మొచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. కేంద్రంలో పెత్త‌నం చలాయించిన ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రాల్లో క‌నీసం అధికారం నిల‌బెట్టుకోలేక‌పోతోంది. పార్టీ నేత‌ల మధ్య విభేదాల‌ను ప‌రిష్క‌రించ‌లేక‌.. అనాలోచిత నిర్ణ‌యాల‌తో కొంపు ముంచుకుంటోంది. బీజేపీ ధాటికి నిల‌బ‌డి 2017లో పంజాబ్‌లో మాజీ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు.

కానీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన న‌వ‌జోత్ సింగ్ సిద్ధూతో అమ‌రీంద‌ర్‌కు విభేదాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అది తెలిసి కూడా సిద్ధూను అధిష్ఠానం పీసీసీ అధ్య‌క్షుడిని చేసింది. దీంతో ముఖ్యమంత్రి ప‌ద‌వి వ‌దిలేసిన అమ‌రీంద‌ర్ పార్టీ నుంచి వెళ్లిపోయారు. తొలి ద‌ళిత ముఖ్య‌మంత్రిగా చ‌న్నీని కూర్చోబెట్టి వాళ్ల ఓట్లు రాబ‌ట్టాల‌ని చూసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. సిద్ధూకు చ‌న్నీకి మధ్య ఆరంభంలో విభేదాలు వ‌చ్చాయి. సీఎం అభ్య‌ర్థిత్వంలోనూ తేడా వ‌చ్చిన‌ట్లు క‌నిపించింది. కానీ అవ‌న్నీ ముగిసిన‌ట్లే కనిపించినా ఎన్నిక‌ల్లో మాత్రం దెబ్బ త‌ప్ప‌లేదు.

ప‌ట్టించుకుంటే క‌దా?
ఏదైనా రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చాయంటే వివిధ పార్టీల అధిష్థానం దానిపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంది. ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో వ్యూహాల‌కు తెర‌తీస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం పంజాబ్ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకున్న‌ట్లే క‌నిపించ‌లేదు. చాలా ఆల‌స్యంగా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా చన్నీనే పార్టీ ప్ర‌క‌టించింది. సిద్ధూతో క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించింది. కానీ సీఎం సీటుపై క‌న్నేసిన సిద్ధూ నిరాశ చెందార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ప్ర‌చారంలోనూ అధికార పార్టీది వెన‌కంజే. అక్క‌డ పాగా వేయ‌డం కోసం ఆప్ శ‌క్తికి మించి ప‌నిచేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం చాలా లైట్ తీసుకుంది. ఇప్పుడు అది ప్ర‌భావం చూపిందని విశ్లేష‌కులు అంటున్నారు.