త్వరలో జనసేన ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేయనుంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు సైతం చేస్తోంది.ఇప్పటికే వైసీపీలో ఉంటూ, అధికారం ఉండి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేని అవస్థ తమదని,తమ స్వేచ్ఛను ముఖ్యమంత్రి హరిస్తున్నారని భావిస్తున్న కీలక నేతలంతా తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన పిలుపునిస్తోంది.ఈ నేపథ్యంలో జనసేన తరఫున కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.ఇదే సమయంలో అటు టీడీపీ నుంచి కొందరు ఇటుగా వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం.
వాస్తవానికి ఎప్పటి నుంచో పార్టీని బలోపేతం చేయాలన్న తలంపుతో పవన్ పనిచేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ వైసీపీలో ఉన్న నేతలు ఎవ్వరయినా సరే తమ పార్టీని కోరుకుంటే తప్పక ఆహ్వానిస్తామని నాదెండ్ల మనోహర్ సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారే విషయమై పలువురు తర్జనభర్జన లు పడుతున్నారు.వైసీపీ సర్కారుకు అధికారానికి సంబంధించిన గడువు తీరిపోగానే పార్టీ మారితే మేలు అన్న భావనలో ఇంకొందరు ఉన్నారు.
మరోవైపు జనసేనకు కూడా నాయకత్వ లేమి విపరీతంగా వేధిస్తోంది.ఆ రోజు అన్నయ్య మెగాస్టార్ వెంట నడిచి పీఆర్పీలో పనిచేసిన వారిలో చాలా మంది చెట్టుకొకరు,పుట్టకొకరు చొప్పున వివిధ పార్టీలలో స్థిరపడిపోయారు. వీరంతా ఇప్పుడు పవన్ పిలిచినా కూడా వచ్చేందుకు వీల్లేని స్థితిలో ఉన్నారు.ఎందుకంటే జనసేన పాలసీలు బాగున్నా కూడా అదే పనిగా ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టడంలో, ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో యుద్ధం చేయడంలో విఫలం అవుతోంది.ముఖ్యంగా ఇప్పటికీ జిల్లా కార్యవర్గాలు చాలా చోట్ల పూర్తి స్థాయిలో లేవు. జిల్లా కార్యవర్గాలే కాదు జిల్లా కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలోలేవు. ఈ సమయంలో వెళ్లే కన్నాఎన్నికల ముందు టికెట్ల కేటాయింపునకు అనుగుణంగా జనసేన గూటికి చేరే అవకాశాన్ని పరిశీలిద్దాం అన్న యోచనలో ఇంకొందరు ఉన్నారు.
టీడీపీ లో అయితే ఇప్పటి నుంచే నియోజకవర్గ ఇంఛార్జిలను నియమిస్తున్నారు కనుక వాళ్లే రేపటి వేళ అభ్యర్థులు అవుతారన్నది అధినేత మాట.ఇదే సందర్భంలో అవకాశాలు రాని వారు కొందరు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి పవన్ తో నడిచేందుకు ఆస్కారం ఉంది.కానీ అటువంటి వారు చివరిదాకా పవన్ తో ఉంటారా లేదా గెలిచాక రాపాక మాదిరిగా హ్యాండ్ ఇచ్చిపోతారా అన్న సంశయం కూడా ఉంది.ఈ దశలో ఎవరు ఎలా ఉన్నా జనసేన బలోపేతంకు ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులే దిక్కు కావడం ఖాయం.అందుకు పవన్ కూడా కొంత సన్నాహాలు చేయాలి.అప్పుడే జనసేన క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించడం సాధ్యం.