పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాను జగన్ సర్కార్ వెంటాడుతోంది. శుక్రవారం ఈ సినిమా విడుదలకు ఏపీ, తెలంగాణలో చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకుంది. ఈ సమయంలో ఏపీలో భీమ్లా నాయక్ మూవీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాల్లో భీమ్లా నాయక్ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
పాత ధరలకే టికెట్‌లు విక్రయించాలంటూ ఎగ్జిబిటర్లకు అధికారులు ఫోన్ చేశారు. దీంతో ఎగ్జిబిటర్లలో ఆందోళన నెలకొంది. లక్షలు పెట్టి సినిమాను కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో తమపై తీవ్ర భారం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు.
ఇటీవల కాలంలో ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ప్రభుత్వం నుంచి సానుకూలంగా నిర్ణయం ఉంటుందని సినీ ప్రముఖులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం వేసిన కమిటీతో పాటు సీఎం జగన్‌ను కలిసి సినిమా సమస్యలు, టికెట్ల రేట్లపై చర్చించారు. చిరంజీవి, మహేశ్, ప్రభాస్, ఆర్ నారాయణమూర్తి, రాజమౌళి, తదితరులు.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.
మంత్రి పేర్ని నాని సమక్షంలో సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి చర్చలు సానుకూలంగా జరిగాయని, సీఎం జగన్‌కు సినీ పరిశ్రమపై అవగాహన ఉందంటూ కితాబు ఇచ్చారు. దీంతో సినిమా విడుదలపై చిత్ర నిర్మాతలు, హీరోలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి ఏపీ ప్రభుత్వం.. శుక్రవారం రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్ సినిమాకు ఝలక్ ఇచ్చింది. పాత విధానమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం.. పవన్ సినిమాపై కక్ష సాధిస్తోందని మండిపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates