అఖిలేష్ ఊ అంటే.. మాయావ‌తి ఊహూ అన్నారా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ర‌ణం హోరాహోరీగా సాగుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ రెండు ద‌శ‌ల ఎన్నిక‌లు ముగిశాయి. అధికార బీజేపీ, స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మ‌ధ్య అక్క‌డ ప్ర‌ధానంగా పోరు న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీతో పాటు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తిని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల కోసం రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ (ఆర్ఎల్‌డీ)తో స‌హా కొన్ని చిన్న పార్టీల‌తో క‌లిసి అఖిలేష్ యాద‌వ్ కూట‌మి ఏర్పాటు చేశారు. త‌మ కూట‌మికి క‌చ్చితంగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో మాయావ‌తితో పొత్తు విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు పొత్తు కోసం ఆమెతో క‌లిసి చ‌ర్చించామ‌ని చెప్పారు. కానీ రాజ‌కీయ‌ప‌ర‌మైన కొన్ని కార‌ణాల వ‌ల్ల బీఎస్పీ అధినాయ‌కురాలు మాయావ‌తి అందుకు అంగీక‌రించ‌లేద‌ని పేర్కొన్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎస్పీ, బీఎస్పీ క‌లిసి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ మ‌రోసారి క‌లిసి పోటీ చేస్తాయ‌ని అనుకున్నారు. కానీ అందుకు మాయావ‌తి ఒప్పుకోలేద‌ని తాజాగా అఖిలేష్ పేర్కొన్నారు. ఆమె బీజేపీకి బీ టీమ్‌గా ప‌నిచేస్తున్నార‌ని ఆయన విమ‌ర్శించారు. అందుకే ప‌శ్చిమ యూపీలో 40 చోట్ల బీఎస్పీ ముస్లిం అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింద‌ని అన్నారు. ఓట్లు చీల్చేందుకే ఇలా చేశార‌ని చెప్పారు. బీజేపీ, బీఎస్పీ ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ప్ర‌కార‌మే ముందుకు సాగుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఎస్పీ అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు ఇలాంటి కుట్ర‌ను ఆ పార్టీలు క‌లిసి అమ‌లు చేశాయ‌ని పేర్కొన్నారు.