కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం… బీజేపీ?

ఎన్నిక‌ల్లో గెలిచి అధికారం ద‌క్కించుకోవ‌డం.. ఇదే రాజ‌కీయ పార్టీల ల‌క్ష్యం. అందుకోసం దేనికైనా అవి తెగిస్తాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఒక‌ప్ప‌టిలా ప్ర‌స్తుత రాజ‌కీయాలు లేవ‌నేది మాత్రం స్ప‌ష్టం. గ‌ద్దె నెక్క‌డం కోసం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏమేం చేయాలో అవ‌న్నీ పార్టీలు చేస్తున్నాయి. పైగా అందుకోసం ప్ర‌త్యేకంగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌లు, స‌ల‌హాదారులు.. ఇలా ఎంతోమందిని నియ‌మించుకుంటున్నాయి. ప్ర‌జ‌ల గురించి ఆలోచించ‌డం మానేసి కేవ‌లం ఓట్ల మీద‌నే దృష్టి పెడుతున్నాయ‌ని ప్ర‌జాస్వామ్య వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నా పార్టీ అయినా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ అయినా అదే తీరు. తాజాగా దేశంలో జ‌రుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలే అందుకు నిద‌ర్శ‌నం.

ఎంతో కీల‌కం..
దేశ రాజకీయాల్లో ఎంతో కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీల‌కు ఎన్నిక‌ల న‌గారా మోగింది. యూపీ తొలి విడ‌త పోలింగ్ కూడా మొద‌లైంది. పంజాబ్ మిన‌హా మిగ‌తా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ది పీఠం. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో నిలుపుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు బీజేపీకి చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్‌తో పాటు స‌మాజ్‌వాదీ పార్టీ, తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం చూస్తున్నాయి. దీంతో ఎన్నిక‌ల రణ‌రంగం హోరాహోరీగా మారింది. ఓట్ల కోసం పార్టీలు ఎంత దూర‌మైనా వెళ్తున్నాయి. ప్ర‌జ‌ల సానుభూతిని పొందేందుకు విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకూ వెన‌కాడ‌డం లేదు.

ఎన్నిక‌ల‌తోనే లింకు..
ప్ర‌స్తుతం దేశంలో రాజ‌కీయ ప‌రంగా ఎక్క‌డ ఏం జ‌రిగినా దాని లింకు ఈ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తోనే ఉంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో హిజాబ్ విషయం పెద్ద వివాదాస్ప‌దంగా మారింది. క‌ళాశాల సూచించిన యూనిఫార్మ్ కాకుండా ముస్లిం యువ‌తులు త‌ల‌కు హిజాబ్ చుట్టుకుని రావ‌డం.. అది చూసి హిందూ యువ‌తులు మెడ‌లో కాషాయ కండువాలు ధ‌రించి రావ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. క‌ళాశాల‌ల్లో అడుగుపెట్టాలంటే యూనిఫార్మ్ మాత్ర‌మే ధ‌రించాల‌ని సూచించినా.. ఈ రెండు వ‌ర్గాల విద్యార్థినులు విన‌డం లేదు. దీంతో ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. చివ‌ర‌కు విషయం హైకోర్ట‌కు వెళ్లింది. ఈ వివాదంపై స్పందిస్తూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీన్ని ఎవ‌రు న‌డిపిస్తున్నారో అంద‌రికీ తెలుస‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప‌రోక్షంగా బీజేపీని ఉద్దేశించే ఆయ‌న వ్యాఖ్య‌లు చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పార్ల‌మెంట్‌లో..
తాజాగా పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీ విభ‌జ‌న అన్యాయంగా జ‌రిగింద‌ని అందుకు కాంగ్రెస్ కార‌ణ‌మ‌ని ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కు ముందు కూడా ఓ సారి మోడీ ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. కానీ ప్ర‌స్తుతం అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసేందుకే ఆయ‌న ఈ వివాదాన్ని మ‌ళ్లీ తెర‌మీద‌కు తెచ్చార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు పంజాబ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మోడీకి.. రైతులు అడ్డుకోవ‌డంతో తిరుగు ప్ర‌యాణమ‌వ‌క త‌ప్ప‌లేదు. దీంతో పెద్ద చ‌ర్చే న‌డిచింది. కావాల‌నే మోడీ సెక్యూరిటీ విష‌యంలో పంజాబ్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని బీజేపీ విమ‌ర్శించింది. ఇదంతా ఓ ఎత్తు అయితే.. యూపీలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముగించుకుని ఢిల్లీకి వెళ్తున్న ఎంఐఎం అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే ఇన్ని ఘ‌ట‌న‌లు జ‌రిగితే.. ఇక పోలింగ్ ముగిసే వ‌ర‌కూ మ‌రెన్ని చూడాల్సి వ‌స్తుందోన‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి